ఏపీ మంత్రులు జ‌గ‌న్ స్పీడ్ అందుకోలేక‌పోతున్నారా...?

Update: 2019-07-09 06:52 GMT
త‌న ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని - వ‌చ్చే ఏడాది త‌ర్వాత త‌ను మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకోవ‌డంతోపాటు .. త‌న కేబినెట్ స‌హ‌చ‌రులు అంద‌రూ కూడా మంచి పేరు తెచ్చుకోవాల‌ని గొప్ప ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకున్నారు వైసీపీ అధినేత‌ - ఏపీ సీఎం జ‌గ‌న్‌. దీనికి అనుగుణంగానే ఆయ‌న సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. మంత్రి వ‌ర్గం కూర్పు చేసుకున్నారు. ఎక్కువ మంది యువ‌త‌కే అవ‌కాశం క‌ల్పించారు. ఇటు మ‌హిళ‌లైనా.. అటు పురుషులైనా యువ‌త‌కు మంచి అవ కాశం ఇచ్చారు. దీంతో త‌నతో పాటు ఆయా మంత్రులు కూడా వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతోపాటు.. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపించేందుకు స‌హ‌క‌రిస్తార‌ని భావించారు.

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి నెల రోజులు నిండాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న పాల‌న ప‌నితీరుపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఎప్పుడెప్పుడు విమ‌ర్శ‌లు సంధించాలా? అని ఎదురు చూస్తున్న టీడీపీ నాయ‌కులు కూడా ఈ నెల రోజుల పాల‌న‌ను భేరీజు వేసుకుని పాయింట్లు ప‌ట్టుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రాష్ట్రంలో రైతుల‌కు స‌రైన రీతిలో విత్త‌నాలు ల‌భించ‌క పోవ‌డం - వైసీపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వంటివి ప్ర‌తిప‌క్షానికి అస్త్రాలుగా మారాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.

అయితే, వీటిని స‌మ‌ర్ధంగా తిప్పికొట్ట‌డంలోను - ప్ర‌భుత్వానికి ఎలాంటి మ‌చ్చ‌లు - మ‌ర‌క‌లు లేకుండా చేయ‌డంలోను కూడా పార్టీలోని మంత్రులు కృషి చేయ‌డం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక‌, త‌న ప్ర‌భుత్వం కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు - ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువచ్చింది. నిజానికి అప్పుల్లో ఉన్న రాష్ట్రం - అధికారంలోకి వ‌చ్చి నెల రోజులు కూడా గ‌డ‌వ‌క ముందుగానే అనేక సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. అయితే, ఈ వేగాన్ని అందిపుచ్చుకుని, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన మంత్రులు - పార్టీ నాయ‌కులు ఆశించిన మేర‌కు కృషి చేయ‌డం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఇక‌, ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ఓ పోలీసు అధికారి బ‌దిలీ విష‌యంలో  వైసీపీ నాయ‌కుడు ఒక‌రు రూ.10 ల‌క్ష‌లు లంచం తీసుకున్న వ్య‌వ‌హారంపై కూడా జ‌గ‌న్ చాలా సీరియ‌స్ అయ్యారు. దీంతో విష‌యం తెలుసుకున్న స‌ద‌రు నాయ‌కుడు ఆ లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశాడు. అయితే, ఇలాంటి వాటిని అరిక‌ట్టాల్సిన బాధ్య‌త ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రుల‌దేన‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న స్పీడుకు త‌గిన విధంగా అమాత్యులు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News