ఏపీ మంత్రులకు హైదరాబాద్ భయం

Update: 2016-03-07 17:30 GMT
ఒకప్పుడు ఏ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులైనా హైదరాబాద్ లో తమ హవా చూపించేవారు. కానీ... రానురాను సీను మారుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత హైదారాబాద్ పేరుకు ఉమ్మడి రాజధాని అయినా సీమాంధ్ర నేతలకు ఏమాత్రం సాగడం లేదు. ముఖ్యంగా ఏపీ టీడీపీ నేతలు - మంత్రులు ఏపీలో అధికారంలో ఉన్నా కూడా రాజధాని హైదరాబాద్ లో మాత్రం తమ జోరు చూపించలేకపోతున్నారు. అంతేకాదు... హైదరాబాద్ లో ఏ చిన్న వివాదంలో చిక్కుకున్నా బయటపడలేక విలవిలలాడుతున్నారు. దీంతో హైదరాబాద్ అంటేనే ఏపీ టీడీపీ నేతలు - మంత్రులు హడలిపోతున్నారు. అందుకే హైదరాబాద్ లో ఉండడానికి కూడా వారు ఇష్టపడడం లేదట. ఏమైనా పనిపై వచ్చినా పూర్తికాగానే వెంటనే ఏపీలోకి ఎంటరైపోతున్నారట.

ఓటుకు నోటు కేసు తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, టీడీపీ నేతలు హైదరాబాద్‌ కు రావడమే పూర్తిగా తగ్గించారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో దొరికిన ఆడియో ఫుటేజిల్లో చంద్రబాబు గొంతు వినిపించిందన్న అభియోగంతో, ఆయన హైదరాబాద్‌ కు రావడం మానేశారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మాదిరిగానే మంత్రులు కూడా ఉమ్మడి రాజధానికి రావడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ లో స్థిరపడిన ఆంధ్ర మూలాలున్న టీడీపీ నేతలు పలువుర్ని విచారించిన విషయం తెలిసిందే. అంతేకాదు..ఏదైనా చిన్న పని జరగాలన్న హైదరాబాద్‌ లో తమ మాట చెల్లుబాటు కాకపోవడంపై ఏపీ మంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, తెలంగాణ సర్కార్ ఆధీనంలో పని చేస్తున్న అధికారులు తమ మాట పట్టించుకోవడం లేదంటున్నారు. మంత్రి రావెల కిషోర్‌ బాబు తనయుని కేసులోనూ, మొదట సుశీల్ పేరును ఎఫ్ ఐఆర్‌ లో చేర్చని పోలీసులు, ఆ తరువాత టీఆరెస్ నేత కేకే కుమార్తె జోక్యంతో సుశీల్ పేరు చేర్చారని అంటున్నారు.

మరోవైపు ఇంకో వాదనా వినిపిస్తోంది. టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు తామంతటా తామే తప్పులు చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి చిక్కుతున్నారని అభిప్రాయం వినిపిస్తోంది. ఓటుకు నోటు కేసుతో పాటు, ఇప్పుడు మంత్రి కిషోర్‌ బాబు తనయుడు వ్యవహారంలోనూ అదే జరిగిందంటున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు దొరికిపోవడం, ఈ కేసుల నుంచి తప్పించుకునే వెసులుబాటు లేకుండా పోవడంతో, హైదరాబాద్ తమది కాదన్న అభిప్రాయం వారి మనస్సుల్లో నాటుకుపోయిందంటున్నారు. అందుకే మంత్రులు కానీ ముఖ్యనేతలు హైదరాబాద్‌ కు వెళ్లినా, తమ పనులు చక్కబెట్టుకుని వీలైనంత వేగంగా వెళ్లిపోవాలనే అనుకుంటున్నారట.
Tags:    

Similar News