కేవీపీ నిరసనకు గళం కలపలేపోయారేం?

Update: 2018-02-03 07:28 GMT
అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా కొందరు నాయకులు వ్యవహరిస్తే.. ఒక విషయంలో తాముగా పనిచేయడానికి స్వాతంత్ర్యం లేనప్పుడు.. కనీసం ఆ పని చేసేవారికైనా కొంత మద్దతు తెలియజేసి.. వారికి అండగా నిలబడడం మంచిది కదా...! తెలుగుదేశం నాయకులకు కనీసం అలాంటి సహృదయత కూడా లేదని ఇప్పుడు ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ నిధులు కేటాయించడంలో వంచనకు పాల్పడిన తర్వాత.. రాష్ట్రానికి చెందిన అందరూ ఎవరికి తోచిన రీతిలో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారయింది.

అటు వారేమో ప్రభుత్వంలో స్వయంగా భాగస్వాములు.. పదవులను కూడా వెలగబెడుతున్నారు.. అదే ప్రభుత్వానికి నిరసనగా ఏమైనా చేస్తే.. కామెడీగా ఉంటుందని ఒక భయం. అదే సమయంలో.. ఎవ్వరూ నోరిప్పి మాట్లాడవద్దు.. మిత్రధర్మంతో సంయమనం పాటించాలి.. ఎవ్వరూ విమర్శలకు దిగవద్దు.. అంటూ అధినేత వేస్తున్న బ్రేకులు మరో వైపు.. ఇలా వారంతా మిన్నకుండిపోతున్నారు.

అయితే శుక్రవారం నాడు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాత్రం.. సభ్యులందరి దృష్టిని ఆకర్షించేలా నిరసన తెలియజేయగలిగారు. ఆయన నల్లటి బోర్డు మీద హెల్ప్ ఆంధ్రప్రదేశ్ అని తెల్ల అక్షరాలు రాసిన ప్లకార్డుతో ఉపసభాపతి పోడియం వద్ద మౌనంగా నిల్చున్నారు. ఏమైనా చెప్తారా అంటే అలా కదలకుండా మౌనంగా నిల్చుండిపోయారు. ఆయన పట్ల కురియన్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడంతో.. అందరి దృష్టి ఆయనపై పడింది.

కాంగ్రెస్ పార్టీకి ఏపీలో దిక్కూమొక్కూలేకుండా పోయిందిగానీ.. మొత్తానికి కేవీపీ ఈ విషయంలో గట్టిగానే నిరసన తెలిపారు. అయితే ప్రజలు ఆగ్రహిస్తున్నది ఏంటంటే.. ఏపీ కోసం ఆయన ఒక్కరే ఎందుకు నిలబడాలి! ఏపీకి చెందిన ఇతర ఎంపీలు కూడా ‘హెల్ప్ ఆంధ్రప్రదేశ్’ అనే విషయాన్ని ఏదో ఒకరీతిగా నినాదాలో - ప్లకార్డులో ఏదో ఒక రూపంలో కేంద్రానికి బుద్ధి వచ్చేలా తెలియజెప్పాలి కదా అని అంటున్నారు. అధికారం పంచుకుంటున్న వారు.. ఏపీ ప్రయోజనాల గురించి బాధ్యతలు పంచుకోడానికి ఇన్ని మీనమేషాలు లెక్కించాలా అని అంటున్నారు. కనీసం కేవీపీ చర్యకు మద్దతుగా అయిన సభలో వ్యవహరించి ఉండవచ్చునని, ఆయనను సమర్థించినంత మాత్రాన.. ఏపీలో కాంగ్రెస్ కు సీట్లు వచ్చేదేమీ ఉండదు కదా.. అని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. గట్టిగా స్పందించకుంటే పాలకపక్షాలకు ప్రజాగ్రహం తప్పేలా లేదు మరి!
Tags:    

Similar News