రెండు నెలల బిల్లు.. తడిసిమోపెడు?

Update: 2020-05-10 14:30 GMT
ఫిబ్రవరిలో రీడింగ్ తీశారు. ఆ తర్వాత కరోనా-లాక్ డౌన్ తో కరెంట్ రీడింగ్ తీయలేదు. మునుపటి వాడకం బట్టి బిల్లులు వేశారు. అయితే మార్చి - ఏప్రిల్ నెలలది కలిపి ఇప్పుడు ఏపీలో విద్యుత్ బిల్లులు వేశారు. అది చూసి జనాలు మొత్తుకుంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా మార్చి - ఏప్రిల్ నెలల్లో విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయకుండా ఇప్పుడు ఒకేసారి స్పాట్ బిల్లింగ్ ఇస్తున్నారు. దాన్ని చూసి వినియోగదారుల గుండె గుభేల్ మంటోంది. రెండు నెలల బిల్లు ఒకేసారి పెద్ద మొత్తంలో రావడంతో తాము ఎలా కట్టాలని తలపట్టుకుంటున్నారు.

రెండు నెలల బిల్లులు జనాలు కట్టలేదు. దీంతో యూనిట్లు పెరిగిపోయి కేటగిరి మారిపోతోంది. దీనివల్ల 1000 రూపాయల కట్టాల్సిన వారికి 2వేలు బిల్లు వస్తోంది.  ఈ విద్యుత్ చార్జీల బాదుడు చూసి ఏపీలో జనాలు ఆందోళనకు గురి అవుతున్నారు.

సాధారణంగా 50 యూనిట్లు - 100 లోపు యూనిట్లు - 100-200 యూనిట్ల స్లాబ్ లుంటాయి. అందరూ వాడే 100-200 యూనిట్లలోపుకు చార్జి 3.60 పైసలు. ఇక 200 యూనిట్లు దాటితే 6.90 పైసలు చార్జి చేస్తారు.

ప్రస్తుతం వేసవి కాలం కావడం.. లాక్ డౌన్ తో జనాలు ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో రెండు నెలలకు కలిపి 200 యూనిట్లు దాటుతోంది. ఆ లెక్కన బిల్లు కూడా రెట్టింపు అవుతోంది. ఇంత మొత్తం తాము కట్టలేమని జనాలు మొత్తుకుంటున్నారు. బిల్లు  ను సరిచేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News