హైకోర్టు అక్క‌డ కాకుంటే..ఇక్క‌డేన‌ట‌

Update: 2018-08-28 05:44 GMT
హైకోర్టు విభ‌జ‌న‌లో ప‌రిణామాల వేగంగా మారుతున్నాయి. వివిధ కార‌ణాల వ‌ల్ల హైకోర్టును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర‌ ప్ర‌భుత్వం ఇందుకు త‌గిన ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తోంది. అమరావతి సమీపంలోని నేలపాడు - తుళ్లూరు గ్రామపరిధిలో ఏపీ సర్కార్ నిర్మిస్తున్న తాత్కాలిక భవన నిర్మాణం పూర్తయిన తర్వాత తరలించడమా? లేక హైదరాబాద్‌ లోనే ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయడమా? అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంద‌ని తెలిసింది. వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో 2019 జనవరి నాటికే ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని కేంద్రం యోచిస్తోంది. హైదరాబాద్‌ లో ఏపీ హైకోర్టుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనను ఇప్పడు అమలుచేయాలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ లో ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తే న్యాయమూర్తులు - న్యాయవాదులు - సిబ్బంది నుంచి సైతం పెద్దగా అభ్యంతరాలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అమరావతిలో అరకొర వసతుల నేపథ్యంలో ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు సైతం ప్రస్తుతం అక్కడ తాత్కాలిక భవనంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు హైదరాబాద్‌ లోనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేస్తే బాగుంటుందనే విషయాన్ని సైతం కేంద్రం దృష్టిలోకి తీసుకుంది.

ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది ధన్‌ గోపాల్‌ రావు తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారించిన జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం 2015 మే 1న తీర్పును వెలువరించింది. తెలంగాణలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తే అన్నివిధాలా సహకరిస్తామని - ప్రస్తుత హైకోర్టు భవనంలోనే ఏపీ హైకోర్టు కొనసాగించుకోవచ్చని, కావాలంటే తెలంగాణ హైకోర్టును ఇతర ప్రాంతానికి తరలిస్తామంటూ తెలంగాణ సర్కార్ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీర్పులో ధర్మాసనం ప్రస్తావించింది. తెలంగాణ భూభాగంపై రెండు హైకోర్టులు ఉండటానికి వీల్లేదని తీర్పును వెలువరించింది. ఏపీ పరిధిలోనే ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పును తాజాగా సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. ఈ అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. తదుపరి విచారణ నిమిత్తం వచ్చేవారం సంబంధిత ధర్మాసనం ముందుపెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ల దాఖలు ఆలస్యం వివరణతోపాటు ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ వ్యాజ్యం ఈ వారంలో విచారించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సవరిస్తే, వెంటనే హైదరాబాద్‌ లో ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ను జారీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు తలపెట్టిన జస్టిస్ సిటీ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో తాత్కాలిక భవన నిర్మాణం ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తిచేస్తామని ఏపీ సర్కార్ చెప్తోంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌ కు ఏపీ సర్కార్ ఇటీవల లేఖ రాసింది. పనులు చురుగ్గా సాగుతున్నాయని - హైకోర్టుకు కావాల్సిన ఫర్నిచర్ - ఇతర మౌలిక వసతులు తమకు తెలియజేయాలని లేఖలో ఏపీ సర్కార్ పేర్కొంది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన అంశాలు - హైకోర్టు విభజన కోసం తాజాగా న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి కమిటీని ఏర్పాటు చేశారు. అమరావతి సమీపంలోని నేలపాడు వద్ద నిర్మిస్తున్న హైకోర్టు తాత్కాలిక భవనాన్ని పరిశీలించి మొదటగా నివేదిక సమర్పించాలని కమిటీ సభ్యులకు చీఫ్ జస్టిస్ సూచించారు. ఈ కమిటీ త్వరలోనే నేలపాడు వెళ్లనుంది. అయిన‌ప్ప‌టికీ, మ‌రోవైపు హైద‌రాబాద్ విష‌యంలోనూ సానుకూలంగా చూస్తోంది.
  


Tags:    

Similar News