వార్ వన్ సైడేనా : సింగిల్ ఫైటింగ్ కి సిద్ధమేనా...?

Update: 2022-06-21 00:30 GMT
ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఎన్నికలకు చాలా కాలం ముందే పొత్తుల గురించి మాట్లాడి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చుకున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన కుప్పం సభలో ఎవరో కార్యకర్త అడిగిన దానికి పొత్తుల గురించి ఇపుడెందుకు తమ్ముడూ అంటే సరిపోయేది. కానీ వన్ సైడ్ లవ్ అని కొత్త భాష్యం చెప్పడం ఆ తరువాత గోదారి జిల్లాలలో త్యాగాలు చేయడానికి రెడీ అంటూ బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడంతోనే ఇపుడు తంటా వచ్చిందా అన్న చర్చ అయితే ఆ పార్టీలో సాగుతోంది.

వీటిని అనుకూల సంకేతాలుగా తీసుకున్న జనసేనాని  సై అన్నారు. వైసీపీకి యాంటీగా అన్ని పార్టీలను కలుపుతామని చెప్పారు. పెద్దన్న పాత్రకు తాను తయారు అని కూడా అన్నారు. నిజానికి ఇవన్నీ జరిగినవి రెండు మూడు నెలలకు ముందు. అనాటికి టీడీపీకి ఇంత ఊపు వస్తుందని ఎవరికీ తెలియదు. అదే టైమ్ లో ఏపీలో  వైసీపీ గ్రాఫ్ కూడా దారుణంగా తగ్గిపోతోందని కూడా అంచనాలు లేవు.

అయితే ఆ తరువాత జరిగిన మహానాడుతోనే సీన్ మొత్తం మారింది. టీడీపీకి తన బలం జన బలం అన్నీ తెలిసి వచ్చాయి. దాంతో ఆ ఉత్సాహంలో వార్ వన్ సైడ్ అని చంద్రబాబు అనడం, మహానాడు వేదికగా పొత్తుల గురించి ఎలాంటి ప్రకటనలు చేయకపోవడమే జనసేనతో గ్యాప్ పెరిగేలా చేసింది అంటున్నారు. పవన్ ప్రతిపాదించిన మూడు ఆప్షన్ల మీద సైలెంట్ గా ఉండడం వ్యూహాత్మకంగా అనుకుంటే అదే చివరికి జనసేనానిలో దూకుడుకు కూడా కారణం అయింది అంటున్నారు.

పవన్ కళ్యాణ్ జనంతోనే తన  పొత్తులు అనేదాకా వెళ్లారు. తానే సీఎం అని, ఏపీని అభివృద్ధి చేస్తామని పర్చూరు మీటింగులో చెప్పుకున్నారు. రెండున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒక విధంగా ఇప్పటిదాకా చంద్రబాబు ఎలాంటి హామీ జనాలకు ఇవ్వలేదు కానీ పవన్ తన ఆవిర్భావ సభ నుంచి ఎన్నికల ప్రణాళికలో అంశాలను ఒక్కటొక్కటిగా జనాలకు చెబుతున్నారు.

అంతే కాదు కొత్త నాయకత్వం రావాలి పాతనాయకత్వం  పోవాలి అని కూడా కోరుకుంటున్నారు. సీఎం గా తానే అని ఒక దృఢ నిశ్చయానికి పవన్ వచ్చేశారనే టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ టైమ్ లో ఆయనతో పొత్తు అంటే కుదిరే వ్యవహారం కాదని కూడా అర్ధమవుతోందిట. దాంతో వార్ వన్ సైడ్ అని అంటున్న టీడీపీ ఈసారి కూడా ఒంటరి పోరుకే తయారు కావాల్సి వస్తోంది అని చెబుతున్నారు.

మొత్తం 175 సీట్లలో టీడీపీకి క్యాడర్  బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల వీక్ గా లీడర్ షిప్  ఉంది. అలాంటివి ఒక పాతిక ముప్పై దాకా ఉన్నాయి. వాటికి రిపేర్లు చేసుకుంటూ తాను గతంలో పెట్టిన కండిషన్లను కూడా పక్కన పెట్టి సీనియర్లను కూడా సమాదరిస్తూ బాబు ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తోంది అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఒంటరి పోరుతో ఎవరి ఓట్లు చీలుతాయన్న బెంగ అయితే టీడీపీలో ఉంది. గతసారి యాభై నుంచి అరవై దాకా నియోజకవర్గాలలో జనసేన ప్రభావం చూపింది టీడీపీ దాని వల్ల దెబ్బ అయింది. ఈసారి అలా ఉంటుందా అన్నకలత  ఒక వైపు ఉన్నా మరో వైపు చూస్తే వైసీపీ మీద విపరీతంగా పెరిగిన వ్యతిరేకత శ్రీరామరక్షగా ఉంటుందని భావిస్తున్నారు.

అలాగే చంద్రబాబు పరిపాలనా అనుభవం కూడా దోహపదపడుతుందని, జనాలు ఈసారి బాబునే సీఎం గా ఎన్నుకుంటారని, ఎన్నికలు దగ్గరపడిన తరువాత జరిగే పొలిటికల్ పోలరైజేషన్ టీడీపీకి అనుకూలంగా ఉంటుందని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి సింగిల్ ఫైట్ కి టీడీపీ సిద్ధపడాల్సి వస్తోంది అంటున్నారు. పవన్ కండిషన్ కి ఒప్పుకుని ఆయనకు అధికార వాటా ఇవ్వడానికి అయితే టీడీపీలో ఎవరూ ఇష్టపడడం లేదు అంటున్నారు.
Tags:    

Similar News