తండ్రికొడుకుల మీద కస్సుమన్న ఏపీ వైసీపీ నేతలు

Update: 2022-04-29 12:02 GMT
గడిచిన మూడేళ్లలో లేని కొత్త పరిణామాలు ఇప్పుడు ఏపీలోనూ.. తెలంగాణలోనూ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో తమ పాలన గురించి.. తమ గొప్పల గురించి చెప్పుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్ కానీ అస్సలు తగ్గట్లేదు. అయితే.. ఈ మాటలు ఏపీ అధికారపక్ష నేతలకు సూదులు మాదిరి మారుతున్నాయి. ఎవరి రాష్ట్రం గురించి వాళ్లు మాట్లాడుకోవాల్సింది పోయి.. పక్క రాష్ట్రం ప్రస్తావన తేవటం.. వారితో పోల్చటం.. పాలన గురించి వేలెత్తి చూపటం.. వాళ్ల కంటే మనం ఎంత బాగా ఉన్నామో అంటూ ఏపీ గురించి సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ అదే పనిగా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ అధికారపక్ష నేతలకు మంట పుట్టిస్తోంది.

తరచూ తెలంగాణలోని డెవలప్ మెంట్ ను ఏపీతో పోల్చటం.. ఈ మధ్యన విద్యుత్ అంశాన్ని ఎక్కువగా హైలెట్ చేసుకోవటం.. పక్కనున్న ఏపీలో విద్యుత్ కోతలు ఏ రీతిలో ఉన్నాయో చూడండి.. మన దగ్గర మాత్రం అలాంటిదేమీ లేదన్న గులాబీ బాస్ మాటలకువైసీపీ నేతలు ఉడికిపోతున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా తెలంగాణ అధికారపక్షం గురించి పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడనట్లుగా జగన్ తీరు ఉండేది. అదే పనిగా ఉమ్మడి రాష్ట్రం గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా రియాక్టు అయ్యే వారు కాదు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా ప్రస్తావించటం ఈ మధ్యన ఎక్కువ కావటం.. అది తమకు నెగిటివ్ గా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన వైసీపీ నేతలు ఇప్పుడు అలెర్టు అవుతున్నారు.

తాజాగా ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ విజయవాడకు వచ్చి తాము చేసిన అభివృద్దిని చూడాలని మండిపడ్డారు. మరో సీనియర్ నేత.. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తలెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ మాదిరే కేటీఆర్ కూడా పిట్ట కథలు చెబుతున్నారన్నారు. ఇలాంటి పిట్టకథలు చెప్పే కేసీఆర్ రాష్ట్రాన్ని విభజించారన్నారు.

విజయవాడకు వచ్చి చూస్తే.. జగన్ ప్రభుత్వం చేసిన డెవలప్ మెంట్ కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల  అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే.. ప్రజలు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోసం కోరుకునే పరిస్థితులు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో కేసీఆర్ కు మంట పుట్టే మాట వైసీపీ నేతల నోటి నుంచి రాలేదు. కాస్త ఆలస్యమైనా.. మల్లాది విష్ణు చేసిన తాజా వ్యాఖ్యలు వారికి ఒళ్లు మండేలా చేస్తాయని చెప్పక తప్పదు. ఏమన్నా ఫర్లేదు కానీ.. ఉమ్మడి రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు కోరుకునే పరిస్థితులు ఉన్నాయన్న మాట మాత్రం వారిని బాగా డిస్ట్రబ్ చేయటమే కాదు.. రానున్న రోజుల్లో ఏపీ మీద మరింత మండిపడే అవకాశం ఉందంటున్నారు. కదిలించి మాటలుఅనిపించుకోవటంతో వచ్చే ఇబ్బంది కేసీఆర్.. కేటీఆర్ లకు అనుభవంలోకి వస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News