జనసేనలో చేరబోతున్న మొదటి మాజీ ఎమ్మెల్యే?

Update: 2017-08-09 09:52 GMT
 తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జనసేన తరపున టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయినప్పుడు వారి మధ్య ప్రధానంగా సీట్ల చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పైకి ఏమీ చెప్పకపోయినా.. లోపల మాత్రం ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై కూడా పవన్ కల్యాణ్ - చంద్రబాబులు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా గిద్దలూరు జనసేన కే దక్కనుందని సమాచారం.

ఈ మేరకు అన్నా రాంబాబుకు క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. ఇక అన్నా రాంబాబు జనసేన తరపున పని ప్రారంభించనున్నాడని తెలుస్తోంది. రాజీనామాకు వారం రోజుల ముందే పవన్ కల్యాణ్ తో రాంబాబు సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు లభించిన స్పష్టతతోనే ఈయన టీడీపీకి రాజీనామా చేశాడని గిద్దలూరు జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

 అన్నా రాంబాబుకు ఇది వరకూ కూడా మెగా ఫ్యామిలీతో పని చేసిన నేపథ్యం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున రాంబాబు గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ లోకి వెళ్లిపోయాడు. ఆపై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గిద్దలూరు నుంచి పోటీ చేశాడు.

క్రితం సారి ఎన్నికల్లో ఈయన సత్తా చాటలేకపోయాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయకపోవడంతో ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైకాపా తరపున గెలిచిన అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి ఫిరాయించాడు. ఈ చేరికతో అన్నా రాంబాబు - అశోక్ రెడ్డిల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీలో ఉంటే టికెట్ దక్కడమూ సందేహమే, దక్కినా గెలవడమూ సందేహమే.. అందుకే పవన్ పార్టీలోకి చేరిపోవడానికి టీడీపీ కండువాను విసిరికొట్టి వచ్చాడని సమాచారం. మొత్తానికి గిద్దలూరు రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News