నా ఇష్టం.. అండర్‌వేర్ వేసుకొను, మాస్క్ ధరించను: అమెరికాలో వింత ఉద్యమం

Update: 2020-06-26 17:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమంతా మాస్క్‌లు ధరిస్తోంది. ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి లేదా ఇతరుల భద్రత కోసం మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం తప్పనిసరిగా మారాయి. అయితే అమెరికాలోని ప్లోరిడాలో మాస్క్‌లపై భిన్నమైన ఉద్యమం ప్రారంభమైంది. ముఖానికి మాస్క్ కట్టుకోవాలని బలవంతం చేయడం ఏమిటని, తాము అలా చేసేది లేదని, తమకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని ఉద్యమిస్తున్న వారు చెబుతున్నారు.

ఈ యాంటీ-మాస్క్ ఉద్యమానికి ఫ్లోరిడాలో భారీ మద్దతు లభిస్తోంది. నేను లో-దుస్తులు ధరించనని, అదేవిధంగా మాస్క్ కూడా ధరించనని ఓ వ్యక్తి చెప్పాడు. మాస్క్‌లు ధరించడాన్ని వ్యతిరేకిస్తున్న వారు కౌంటీకి హాజరై తమ వాదనలు బలంగా వినిపించారు. ఈ సమయంలో సదరు వ్యక్తి చెప్పిన సమాధానం ఇదీ. దేవుడు ప్రకృతిని ఆస్వాదించేందుకు అద్భుతమైన శ్వాస వ్యవస్థను ఇచ్చాడని, మీరం,తా దానిని మరిచిపోవాలని చెబుతున్నారని, మాస్కు ధరించకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పడం ఏమిటని, ఇదేమీ కమ్యూనిస్ట్ దేశం కాదని మండిపడుతున్నారట.

మనిషికి శ్వాస తీసుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీస్తున్నారు. ఇది కమ్యూనిస్ట్ రాజ్యం కాదని, దేవుడు మాత్రమే తమను శాసించగలడని చెబుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే 4 లక్షల మందికి పైగా చనిపోయారు. మాస్కులు ధరించడాన్ని వ్యతిరేకిస్తున్న మరో వ్యక్తి మాట్లాడుతూ దేవుడు మనిషిని సృష్టించాడని, శ్వాస తీసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చాడని చెబుతున్నారు. అలాంటప్పుడు శ్వాస తీసుకోవడాన్ని నియంత్రించే హక్కు ఎక్కడిది అంటున్నారు. ముసుగు ధరించకపోవడం మా ఇష్టమని, అలా చేస్తే తమను అరెస్ట్ చేస్తామని చెబుతున్నారని, అసలు మానవత్వం లేనందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారని డాక్టర్‌ను ఉద్దేశించి మరో వ్యక్తి చెప్పాడు.

అయితే వీరి వాదనతోను చాలామంది విబేధిస్తున్నారు. కరోనా నేపథ్యంలో మన మంచి కోసమే చెబుతున్నారని, అలాంటప్పుడు ఇలా ప్రశ్నించడం సరికాదని చెబుతున్నారు. మంచి కోసం చెబుతున్నప్పుడు ఉద్యమించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
Tags:    

Similar News