ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆ బోర్డు మిస్

Update: 2020-01-27 04:17 GMT
ఏపీ రాజధాని అమరావతి మీద నెలకొన్న తాజా పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు పట్టుదల తో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఐ లవ్ అమరావతి అన్న డిజిటల్ అక్షరాల తో కూడిన భారీ బోర్డు నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు.

ఆకర్షణీయంగా కనిపించే ఈ బోర్డు సెల్ఫీ పాయింట్ గా మారటమే కాదు.. పలువురు ప్రత్యేకంగా ఫోటోలు తీసుకునే వారు. తాజాగా ఆ బోర్డు మాయం కావటం ఆసక్తికరంగా మారింది. అమరావతి పేరును బ్రాండ్ చేయటానికి.. పాపులర్ చేసేందుకు వీలుగా ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెబుతారు.

విజయవాడ - గుంటూరు హైవేల మధ్యలో నిర్మించాలని తలపెట్టిన అమరావతి నగరానికి ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా ఈ భారీ బోర్డు ఏర్పాటు చేసినట్లు గా చెబుతారు. అలాంటి ఈ బోర్డు అకస్మాత్తుగా తొలగించటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నట్లుండి ఈ బోర్డును తొలగించటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది ప్రశ్న గా మారింది.

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసినా.. శాసన వ్యవహారాల రాజధానిగా అమరావతి నే  కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఈ బోర్డును తొలగించాల్సిన అవసరం ఏమిటన్న క్వశ్చన్లు పలువురి నోట వినిపిస్తున్నాయి. అయితే.. ఈ బోర్డును ఇటీవల గుర్తు తెలీని వాహనం ఒకటి ఢీ కొందని.. దీంతో ఒక అక్షరం మిస్ అయ్యిందని చెబుతున్నారు. రిపేర్ చేయించటం కోసం దాన్ని తొలగించినట్లు చెబుతున్నారు. అయితే.. ఆ బోర్డును వాహనం ఢీ కొనే ఎత్తులో లేదన్న వాదన కు అధికారులు సమాధానం చెప్పక పోవటం గమనార్హం.
Tags:    

Similar News