ఏపీలో సువార్త రాజ‌ధాని.. బైబిల్‌ రాజ‌ధాని ఉండ‌వ్‌.. : సోము స‌టైర్లు

Update: 2023-01-22 13:42 GMT
ఏపీ రాజధాని విష‌యంపై  బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి స‌టైర్లు పేల్చారు. ``రాష్ట్రంలో ఒక‌టే రాజ‌ధాని. అది అమ‌రావ‌తి. దీనికి బీజేపీ ఎప్పుడో మ‌ద్ద‌తిచ్చింది. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ.. మా స్టాండ్ అమ‌రావ‌తికే. సీఎం జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు.. సువార్త రాజ‌ధాని.. మూడో అధ్యాయంలో నాలుగో వ‌చ‌నం రాజ‌ధాని.. బైబిల్ రాజ‌ధాని అంటూ.. ఏమీ ఉండ‌వు`` అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. బీజేపీ నాయ‌కులుగా తాము ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని.. అది అమరావతేనని స్పష్టం చేశారు. రాజధాని కోసం వేల కోట్లు నిధులు కేంద్రం ఇచ్చిందని, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమి చేస్తున్నా రని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వారిని ప్రశ్నించకుండా.. అమరావతికే కట్టుబడి ఉన్నామన్న తమను ఎందుకు ప్రశ్నిస్తారని మీడియాను ఉద్దేశించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న ద‌గ్గర‌ బైబిల్ వ‌చ‌నాలు చెల్ల‌వ‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్ ఇంట్లో ఏం చేస్తారో.. అంద‌రికీ తెలుసునంటూ.. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ చేప‌ట్ట‌నున్న యువ‌గ‌ళం యాత్ర‌కు సంబంధించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆరేళ్లు రోడ్డు మీద నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను రోడ్డు ఎక్కనివ్వకుండా జీవో ఇచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు.

ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయిందని.. మేము అభివృద్ధి చేస్తుంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయన్నారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో పెడింగ్‌లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేస్తామన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల‌తో మోడీ చేస్తున్న అభివృద్ధి చెపుతున్నామని... ఇతర రాజకీయపార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయని సోము విమర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లొ పొత్తుల గురించి మాట్లాడుకునేందుకు చాలా స‌మ‌యం ఉంద‌న్నారు.
Tags:    

Similar News