ఏపీ రాజధాని లొల్లిలో ఈ పాయింట్ అస్సలు మిస్ కాకూడదు?

Update: 2022-10-15 04:54 GMT
ఏపీ రాజధాని అంశం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఏపీ రాజదానిగా అమరావతిని డిసైడ్ చేయటం.. భారీ ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం చేయటంతో పాటు.. భారీగా భవనాలు నిర్మించేయటం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రాజధాని మార్చే ఆలోచన లేదని.. అలా జరుగుతున్న ప్రచారం తప్పని తేల్చి చెప్పిన జగన్.. ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు ఇవ్వాలని కోరిన వేళ.. ఆయన కోరికను మన్నించారు ఏపీ ప్రజలు. అలా ముఖ్యమంత్రి అయిన ఆయన.. తాను చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి భిన్నంగా ఒక రాజధాని కాదు మూడు రాజధానులంటూ మొదలుపెట్టిన ఆట ఇప్పుడు పీక్స్ కు చేరింది.

ఓవైపు అమరావతినే రాజధానిగా ప్రకటించాలని అమరావతి రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రను చేపట్టటం తెలిసిందే. దీనికి పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న వైనం ఇప్పుడు చర్చగా మారింది. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ తిరుపతి వరకు పాదయాత్రను చేపట్టిన వైనం తెలిసిందే. ఆ సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఎవరూ ఎలాంటి కార్యక్రమాల్ని నిర్వహించలేదు. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా గళం విప్పుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే..తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఏది ఏమైనా తాము మూడు రాజధానుల మాట మీదే ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసి తీరుతామని జగన్ సర్కారు స్పష్టం చేస్తోంది. ఇదే నిజమైతే.. ఏపీ రాజధానికి ఎప్పుడైనా మూడినట్లే అని చెప్పాలి. ఇప్పటికే ఏపీకి రాజధాని శాపం ఉందన్న చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది.

ఘన చరిత్ర ఉన్న ఏపీ ప్రాంతానికి.. ప్రజలకు ఒక రాజధాని పట్టణం అంటూ లేకపోవటం ఏమిటన్న మాట తరచూ తెర మీదకు రావటం తెలిసిందే. ఏపీ రాజదానిగా అమరావతిని డిసైడ్ చేసిన వేళ.. దానికి ఓకే చెప్పిన జగన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా మూడు రాజధానుల కాన్సెప్టును తెర మీదకు తీసుకురావటంతో.. రాష్ట్రంలోని రాజకీయం మాదిరి.. టీడీపీ.. బీజేపీ.. జనసేనలు అధికారంలోకి వస్తే అమరావతి.. వైసీపీ పవర్లోకి వస్తే మూడు రాజధానుల కాన్సెప్టు తెర మీదకు రావటం ఖాయమని చెప్పాలి.

చంద్రబాబు సర్కారు అమరావతి రాజధానికి కట్టుబడి ఉండగా.. జగన్ మూడు రాజధానుల విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారని చెప్పక తప్పదు. ఏపీలో రాజకీయం వ్యక్తిగత స్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. రాజధాని విషయంలో అధికార.. విపక్ష పార్టీలు పట్టుదలకు పోవటం ఏపీ ప్రజలకు.. రాష్ట్రానికి శాపంగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.

ఇప్పుడు మూడురాజధానులను తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినా.. తర్వాత వచ్చే ప్రభుత్వం మూడు రాజధానులను కాస్తా అమరావతినే రాజధానిగా డిసైడ్ చేస్తే ఏం చేయాలన్నది ఏపీ ప్రజల ముందున్న ప్రశ్న. ఇప్పటి మాదిరే అమరావతి అనుకూల వాదనలు.. ప్రతికూల వాదనలు ఎప్పటికి నిత్యనూతనంగా మారతాయని చెప్పక తప్పదు. రాజధాని అంశం ఆగని రచ్చగా మారి.. ఏపీ ప్రజలకు కొదవలేని రీతిలో రాజకీయ ఆనందాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News