బాబు సెక్యురిటీ ఆఫీసర్ కు అదిరే పదవికి జగన్ రెఢీ?

Update: 2021-06-06 08:30 GMT
ఆసక్తికర నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు నిలుస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీస్తున్న ఈ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ మధ్యనే ఏపీ శాసన మండలి ఛైర్మన్ పదవి ఖాళీ కావటం తెలిసిందే. ఈ పదవిని ఎవరికి ఇస్తారన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.

అయితే.. జగన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని ఆలోచించిన తర్వాతే ఆయన తీసుకున్నట్లు చెబుతున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబు మాదిరే మండలి ఛైర్మన్ పదవిని మైనార్టీ వర్గాల నేతకు అప్పజెప్పాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు ఆయన ఎంపిక చేసిన నేత ఇప్పుడు ఆసక్తికరంగా మారారు. ఆయన ఎవరో కాదు.. చంద్రబాబుకు ఒకప్పుడు సెక్యురిటీ అఫీసర్ గా వ్యవహరించిన ఇక్బాల్ కు కీలక పదవిని అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఇక్బాల్.. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బాలక్రష్ణ చేతిలో ఓడిపోయారు. దీంతో.. ఆయనకు అప్పట్లోనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీగా కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో.. ఆయన 2027 మార్చి 29 వరకు కొనసాగనున్నారు. ఆయన్ను మండలి చైర్మన్ గా ఎంపిక చేస్తే.. అన్ని సమీకరణాలు సరిగ్గా కుదురుతాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News