జగన్ కొత్త కేబినెట్ వచ్చేస్తుందట.. అందులో అంతా కొత్తవారేనట

Update: 2021-10-19 07:11 GMT
బలమైన ప్రజాకర్షక నేత.. అనూహ్యమైన వ్యూహాల్ని అమలు చేస్తే.. ఆయన అధికారానికి తిరుగు ఏముంటుంది? పని తీరు ఆధారంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చర్యలు తీసుకోవటాన్ని ప్రజలు హర్షిస్తారు. అదే రీతిలో.. తన మొత్తం ఐదేళ్ల పదవీకాలంలో సగభాగం ఒక కేబినెట్ తో మరో సగం కొత్త కేబినెట్ తో పాలన సాగించాలన్న జగన్ ఆలోచన ఇప్పటికే అందరూ ఆమోదముద్ర వేయటంతో పాటు.. ఈ ప్రయోగం ఎలా ఉంటుందన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే.. జగన్ కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేళ్లు పూర్తి అవుతున్న వేళ.. తాను గతంలో చెప్పినట్లుగా కేబినెట్ పునర్విభజనకు సంబంధించి స్పష్టమైన ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు వినిపించిన అంచనాలకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో కొత్త కేబినెట్ ను డిజైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంతకాలం జరిగిన చర్చకు భిన్నంగా.. కేబినెట్ లోని అందరిని మూకుమ్మడిగా మార్చేస్తారని.. ఏ ఒక్కరికి మినహాయింపు ఇవ్వరన్న మాట బలంగా వినిపిస్తోంది. కొత్త కేబినెట్ లో అందరూ కొత్తవారే ఉంటారని.. పాతవారిలో ఒక్కరిని కూడా కొత్త కేబినెట్ లో తీసుకునే వీల్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

దీనికి కారణం.. అనవసరమైన తలనొప్పుల్ని తెచ్చుకునే కన్నా.. వాటికి దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. పాత కేబినెట్ లోని బలమైన.. సమర్థులైన నేతల్ని గుర్తించి కొందరికి ప్రభుత్వంలో కీలక పదవులు.. మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగిస్తారని చెబుతున్నారు. కొత్త కేబినెట్ లో పాత కేబినెట్ లో మాదిరే పాతిక మంది ఉంటాని.. అందరూ కొత్త వారే ఉంటారని స్పష్టం చేస్తున్నారు.

పని మంతులు.. రెండున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారిలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న వారికే మంత్రులుగా అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అదే చేస్తే.. కొత్త టీంతో సరికొత్త పాలనను అందించొచ్చని.. పార్టీలోనూ విబేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. డిసెంబరు మొదటి వారానికి కొత్త కేబినెట్ కొలువు తీరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఇదే కానీ వాస్తవరూపం దాలిస్తే.. ముఖ్యమంత్రి జగన్ ధైర్యానికి.. ఆయన వేస్తున్నసాహసోపేత అడుగు చరిత్రలో అలా నిలిచిపోతుందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News