ఏపీ అసెంబ్లీలో బాబుకు గురి పెట్టిన జగన్ ప్రశ్నాస్త్రాలు

Update: 2022-09-16 14:13 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు.. మీరు ఏం కావాలంటే దాని మీదనే చర్చిద్దామంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇవ్వటం.. ఆ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడితో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నిజానిు కి అసెంబ్లీ సమావేశాలంటేనే విపక్షం కత్తులు నూరి.. ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు సిద్ధం కావటం.. అధికారపక్షం ఆత్మరక్షణలో పడటం లాంటివి పాత ముచ్చట్లుగా మారిన వైనం జగన్ ను చూస్తే అర్థమవుతుంది. తానే చర్చల ఎజెండాను సిద్ధం చేసుకున్న వైనం కనిపిస్తుంది. విపక్షం చర్చించటానికి మక్కువ చూపే అంశాల మీదనే తమ వాదనను సిద్ధం చేసుకొని.. ఎదురుదాడి చేసే సరికొత్త వ్యూహానికి తెర తీశారు.

అందుకు తగ్గట్లే ఏపీ రాజధాని అమరావతి మీదా.. దాని కోసం జరుగుతున్న ఉద్యమం మీదా విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న అప్పుల మీదా తన వాదనను వినిపించి.. విపక్షాలకు పనేం లేకనే నోటికి వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నాయని.. వారి విమర్శల్లో ఏ మాత్రం పస లేదన్నట్లుగా విరుచుకుపడిన వైనం చూస్తే.. ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ మాష్టారు ఫుల్ గా ప్రిపేర్ అయిన వైనం అర్థమవుతుంది.

సభలో విపక్ష అధినేత ఉండకపోవటం.. మాట్లాడే తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడేందుకు.. వారిని తాను అనుకున్నట్లుగా కంట్రోల్ చేసేందుకు సిద్ధమైనట్లుగా అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుంచి చంద్రబాబు.. ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. టీవీ5 పేర్లను అదే పనిగా ప్రస్తావించటం కనిపిస్తూ ఉంటుంది. సభలో జగన్ సంధించిన పలు ప్రశ్నాస్త్రాల్ని చూస్తే.. ఆయన ఎజెండా ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది.

-  నాడు లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..?

-  2019లో రాష్ట్ర బడ్జెట్‌ను చంద్రబాబు అపద్ధర్మ సీఎంగా ఉంటూ ప్రవేశ పెట్టారు.  అప్పటి బడ్జెట్.. ఈ సంవత్సరం  మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు ఒక్కటే. అప్పుడు రూ.2.27 లక్షల కోట్లు అయితే.. ఈ ఏడాది రూ.2.50 లక్షల కోట్లు. మరి.. చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి ఎందుకు లేదు? ఆసరా ఎందుకు లేదు? చేయూత, రైతు భరోసా పథకాలు ఎందుకు లేవు?

-  నవరత్నాల పథకాల ద్వారా ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా లబ్థిదారుల ఖాతాలకు బదిలీ చేయటం ద్వారా ఎలాంటి అవినీతి.. వివక్ష లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇచ్చాం.

-  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు లేవు?21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు?ఈ పథకాలన్నీ ఇప్పడే ఎందుకు జరుగుతున్నాయి?

-  చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బులన్నీ ఎవరెవరి జేబుల్లోకి పోయాయన్నది ఆలోచించాలి.

-  ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో గురించి ప్రచారం చేస్తుంటే.. మా అప్పలనర్సయ్య మాట్లాడుతూ..ఇవన్నీ అవుతాయా అని ప్రశ్నించారు. కానీ.. ఈరోజున వన్నీ అవుతున్నాయి.

-  చంద్రబాబు హయాంలో దోచుకో.. పంచుకో..తినుకో..అనే పథకం ఉండేది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. వీళ్ల పని దోచుకోవడం.. పంచుకోవడం వారు ఏం దోచుకున్నా.. పంచుకున్నా అడిగేవారు ఉండరు. రాసే వాడు ఉండడు.

-  రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే విజయవాడకు ఎక్కువ మేలు.

-   విజయవాడ పశ్చిమ బైపాస్ అభివృద్ధి చెందుతోంది. గన్నవరం సమీపంలోని చిన్న అవుటుపల్లి నుంచి..గొల్లపూడి వరకు రూ.1,321 కోట్లతో 30 కి.మీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనిలో 17.08 కి.మీ పనులు పూర్తయ్యాయి.65 శాతం పనులు పూర్తి, 65 శాతం నిధులు ఖర్చు.

-  గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా బ్రిడ్జి కట్టి..చినకాకానిమ వద్ద చెన్నై జాతీయ రహదారిని కలిపే రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. ఇది 18 కి.మీ రోడ్డు, రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 33శాతం పనులను 31 శాతం నిధులు ఖర్చు చేసి పూర్తి అయ్యాయి. 2024 నాటికి ఇది పూర్తి అవుతుంది.

-  విజయవాడ బాగుపడాలని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.

-  కృష్ణా నది నుంచి కృష్ణ లంక వాసులను కాపాడటానికి రూ.137 కోట్లతో ఒకటిన్నర కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ కట్టాం.

-  చంద్రబాబు నివాసముండే కరకట్టకు ఒక వైపు వాహనం వస్తే..మరో వాహనం పోవడం కష్టం. కానీ.. ఈ పెద్ద మనిషి కనీసం ఆ రోడ్డును వెడల్పు చేయలేదు. మనం రూ.150 కోట్లు ఇచ్చి కరకట్ట రోడ్డు వెడల్పు చేస్తున్నాం.

-  విజయవాడలో రూ.260 కోట్లతో అంబేద్కర్ పార్క్‌.

-  విజయవాడలో చంద్రబాబు 40 గడులు కూలిస్తే.. కనకదుర్గమ్మ గుడికి మేం రూ.70 కోట్లు ఇచ్చాం.

-  అమరావతిలో వెచ్చించిన దానిలో కేవలం 10 శాతం అంటే.. రూ.1.10 లక్షల కోట్లకు రూ.10 -11 వేల కోట్లు విశాఖలో ఖర్చు చేస్తే..ఆ నగరాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు. విశాఖలో ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. డ్రైనేజీ, నీళ్లు, కరెంట్ వంటి కనీస వసతలు ఉన్నాయి. వీటి మీద మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కేవలం మెరుగులు దిద్దేందుకు కాస్తా డబ్బులు పెట్టాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News