సడెన్ గా జగన్ ముందస్తు అంటే...?

Update: 2022-09-18 16:30 GMT
రాజకీయాల్లో ఎపుడూ నిబ్బరం పనికిరాదు. అలాగే ఎదుటి వారిని తేలికగా చూస్తూ తమ ఆట వదిలేయడమూ మంచింది కాదు. ఎపుడూ చాన్స్ కోసమే అంతా చూడాలి. అయితే ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయం సాగుతోంది. ఆదిలో హడావుడి చేసి తీరా ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ  విపక్షం డల్ అవుతోంది. అటు టీడీపీ చూసినా ఇటు జనసేన చూసినా ఇలాగే సీన్ ఉంది.

మరి ఇదే తనకు అడ్వాంటేజ్ అని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అపుడు విపక్షం పరిస్థితి ఏంటి అన్నదే చర్చగా ఉంది మరి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని భావించి గత ఏడాదిగా అటు టీడీపీ ఇటు జనసేన హడావుడి చేశాయి. తీరా చూస్తే ఎన్నికలు ఉండవని నెమ్మదిగా  వారు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను వాయిదా వేసుకోవాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. మరో వైపు టీడీపీలో చంద్రబాబు జిల్లాలా టూర్లు ఆగిపోయాయి. లోకేష్ పాదయాత్ర ఎటూ తేలడంలేదు.

ఒక విధంగా విపక్షం అయితే జనంలోకి వెళ్ళడంలేదు. దానికి కారణం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేడని సంకేతాలు పంపించారు. ఈ మధ్యనే ప్రకాశం జిల్లా దర్శిలో ఆయన మాట్లాడుతూ అనుకున్న ప్రాజెక్టులు అన్నీ వచ్చే ఏడాది నవంబర్ కి పూర్తి అవుతాయని, అవి అయ్యాకే ఎన్నికలు అని హింట్ ఇచ్చారు. దాంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ రకమైన ధీమాతోనే పవన్  బస్సు యాత్రను సైతం వాయిదా వేసుకున్నారు అని చెబుతున్నారు.

అయితే విపక్షం నాడు దూకుడుగా ఉంది కాబట్టి జగన్ తగ్గి ఉండవచ్చు. ఇపుడు విపక్షం రిలాక్స్ మూడ్ లోకి వస్తే అపుడు జగన్ ముందస్తు ఎన్నికలకు సడెన్ గా వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తిని కలిగించే అంశమే. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు  లేక వెళ్లరు ఇలా  ఈ రెండూ ఊహాజనితమైన ప్రశ్నలే. కానీ రాజకీయాల్లో ఎపుడు పరిస్థితులే డామినేట్ చేస్తాయి. ఇపుడు మూడు రాజధానుల మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు స్టే ఇవ్వకపోవచ్చు అనుకుంటే ఈ కేసు విచారణ జరగడానికి కొంత కాలం పడుతుంది.

అంటే అపుడు ఈ అంశం కోర్టులో ఉంటుంది అన్న మాట. అలాంటి టైం లో అమరావతి కాదు మూడు రాజధానుల అంశం మీద మేము కట్టుబడి ఉన్నామని వైసీపీ కోర్టు తీర్పు కంటే ముందే జనాల వద్దకు వెళ్ళి ఉత్తరాంధ్రా రాయలసీమ ప్రాంతాల సెంటిమెంట్ ని సొమ్ము చేసుకునే ఎత్తుగడలకు పాల్పడితే విపక్షం సంగతేంటి అన్నది ఒక చర్చగా ఉంది. అదే విధంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్ నాటికి  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకుని అసెంబ్లీని రద్దు చేస్తూ మూడు రాజధానుల మీద రిఫరెండం అని వైసీపీ కనుక వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలకు వెళ్తే అపుడు దాన్ని కౌంటర్ చేయడానికి విపక్షం సిద్ధంగా ఉందా అన్నది ఒక కీలకమైన ప్రశ్న.

ఇంకో వైపు చూస్తే సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున ప్రకటించేసి కొన్ని వర్గాలను ఆకట్టుకుని వైసీపీ ఎన్నికలకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతోందని టాక్ నడుస్తోంది. ఇపుడు ఎటూ విపక్షం చల్లబడిందన్న సూచనలు ఉన్నాయి. అదే టైం లో గడప గడపకూ ప్రొగ్రాం ద్వారా తమ పార్టీ బలాలూ బలహీనతలు బాగా తెలుసుకున్న వైసీపీ  హై కమాండ్ దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగేలా అడుగులు ముందుకు వేస్తే అపుడు విపక్షం ధీటుగా జవాబు ఇవ్వగలదా అన్నదే అసలైన చర్చ.

ఇక్కడ విపక్షం సీన్  ఎలా ఉంది అంటే పొత్తుల మీద ఇంకా ఆలోచనలు తప్ప అడుగులు పడలేదు. అలాగే పవన్ పూర్తి స్థాయిలో జనంలోకి రాలేదు. చంద్రబాబు లోకేష్ కూడా అదే విధంగా ఉన్నారు. బీజేపీ తో పొత్తులు టీడీపీకి అయితే ఈ రోజుకీ  కుదరలేదు. అవి తెలంగాణా ఎన్నికల ఫలితాల తరువాత అని అంటున్నరు. సో ఇలాంటి పరిస్థితుల్లో అంతా సర్దుకునే లోగా ఎన్నికలు అంటూ జగన్ రంగంలోకి దిగితే అపుడు ఏపీ పొలిటికల్ సీన్ ఎలా ఉంటుంది అన్నదే చూడాలి.

ఏది ఏమైనా రాజకీయ పార్టీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అవతల వారు ఏమరుపాటుగా ఉన్నారనో లేక అలా తాము అనుకునో రిలాక్స్ అయితే మాత్రం గేమ్ టోటల్ చేంజ్ అవుతుంది. సో ముందస్తు ఎన్నికలకు ఇదే తగిన తరుణం అని ఎపుడు అనిపించినా జగన్ దూకేస్తారు. ఇప్పటికే వైసీపీలో ఆ రకమైన వేడి ఉంది కాబట్టి  విపక్షంలో ఉన్న వారు ఎవరేమి యాత్రలు చేయాలనుకుంటున్నారో  వాటిని చేసేయాలి. అలా వాయిదాల కంటే  రెడీ అయిపోవడమే ఎపుడూ బెటర్ అన్నదే  ఒక విశ్లేషణ.
Tags:    

Similar News