సాకే సార‌థ్యం.. కాంగ్రెస్‌కు క‌లిసిరాలేదా..?

Update: 2021-06-25 05:30 GMT
ఏ పార్టీకైనా.. అధ్య‌క్ష స్తానంలో ఉన్న‌వారు చాలా కీల‌కం. వారు తీసుకునే నిర్ణ‌యాలు.. వారు వేసే అడుగులే పార్టీని ముందుకు న‌డిపిస్తుంటాయి. అది ఏ పార్టీ అయినా.. ఫార్ములా ఒక‌టే. పార్టీని న‌డిపించే వారే కీల‌కం. ఇప్పుడు ఇత‌ర  పార్టీ ల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మ‌డి ఏపీని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచరంగా మారింది. కేంద్రం ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. నిజానికి క‌మ్యూనిస్టు పార్టీల‌క‌న్నా కూడా చాలా ఘోర‌మైన ప‌రిస్థితికి చేరుకుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. కాంగ్రెస్ ఏపీలో ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే కాంగ్రెస్ జెండా.. అజెండాలు ఏపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ అంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ నేత‌లు ఎక్క‌డ ఉన్నారు అంటే.. వైఎస్సార్ కాంగ్రె స్‌లో అనే వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ పుంజుకోవ‌డం.. అధికారంలోకి రావ‌డం అనేవి మిథ్య‌గానే క‌నిపిస్తోంది. నిజానికి గ‌తంలో తీవ్రంగా దెబ్బ‌తిన్న పార్టీలు కూడా త‌ర్వాత కాలంలో కొద్దిగా గ్యాప్ తీసుకుని పుంజుకున్న ప‌రిణామాలు ఉన్నాయి.

కానీ, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ఈ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. క‌మ్యూనిస్టు పార్టీల‌క‌న్నా ఘోరంగా ఈ పార్టీ ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం కాంగ్రె స్ చీఫ్‌గా ఉన్న సాకే.. శైలజానాథ్‌.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌డంలో విఫ‌ల మ‌వుతున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల స‌మ‌యం  ఉంది. ఈ స‌మ‌యంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సి ఉంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి కూడా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ క్ర‌మంలో పార్టీ విష‌యంలో సాకే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. గ‌తంలో మాదిరిగా మీడియా మీటింగుల‌తో సాధించేది ఏమీ ఉండ‌దు. క్షేత్ర‌స్థాయిలో పాద‌యాత్రలా? మ‌రో యాత్రలా? అనేది సాకే నిర్ణ‌యించుకుని ముందుకు సాగితేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, ఆయ‌న ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేదు. దీంతో సాకే సార‌థ్యం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News