కిరోసిన్ పోసి అగ్గిపుల్ల అంటించమంటున్నారు

Update: 2015-10-14 09:03 GMT
తమ మాటలతో ప్రభావితమయ్యే ప్రజాదరణ ఉన్న వారు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలా మాట్లాడితే లేనిపోని అనర్థాలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. కానీ.. అలాంటిదేమీ పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్న నేతల సంఖ్య ఈ మధ్య పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.  ప్రత్యేక హోదా అంశం ఏపీలో బర్నింగ్ టాపిక్ గా మారిన నేపథ్యంలో.. ఆ అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. ఇదే పార్టీకి చెందిన నేతలు నోరు మూసుకొని మౌనవ్రతం చేశారే తప్పించి.. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడింది లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఏపీ మీద బోలెడంత ప్రేమను కార్చేస్తున్న సీపీఐ నాయకులు గత కొద్దికాలంగా ప్రత్యేక హోదా మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులంతా ఏకమై.. ఆందోళన చేసినా ఒక్కసారంటే.. ఒక్కసారిగా నిరసన ప్రదర్శనలు నిర్వహించని సీపీఐ నేతలు.. ఇప్పుడు మాత్రం సీమాంధ్ర ప్రయోజనాల కోసం మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని అంటున్నారు.

తాజాగా రామకృష్ణ మాటల్నే తీసుకుంటే.. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారిపై కిరోసిన్ పోసి.. అగ్గిపుల్ల గీసి అంటించాలి’’ అంటూ పిలుపునివ్వటం గమనార్హం. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్న ఆయన.. హోదా గురించి హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన వారిపై మాత్రం భౌతిక దాడులు చేయాలన్న రీతిలో వ్యాఖ్యలు చేయటం విశేషం.

ప్రత్యేక హోదా కోసం  చేపట్టిన పాదయాత్ర ఒంగోలుకు చేరుకున్న సందర్భంగా మాట్లాడిన రామకృష్ణ.. ఏపీ అధికారపక్షమైన టీడీపీ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.  చంద్రబాబుకు కానీ ధైర్యం ఉంటే వాస్తవాలు చెప్పాలని.. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. లేదంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. విమర్శలు మామూలే కానీ.. హద్దులు దాటే వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని కామ్రేడ్ మర్చిపోవటం ఏమిటో..?
Tags:    

Similar News