అతను కదరా... నాయకుడు అంటే... ?

Update: 2022-01-01 00:30 GMT
నాయకుడు ఎలా ఉండాలి. చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నాయకుడు అంటే నడిపించేవాడు. దేనికైనా వెరిచేవాడు కాదు, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా బీరువుగా మూలన కూర్చోకుండా ధీరుడుగా ఎదురించి ఎదురెళ్ళేవాడు. అంతే కాదు, నిస్వార్ధం, నిడారంబరత్వం, నమ్మిన వారిని గుర్తించి గౌరవించడం, అవసరమైన వెళలలో తన‌ వారిని కాపాడుకోవడం ఇవన్నీ నాయకత్వ లక్షణాలుగా చెబుతారు.

ఇక నాయకుడు అంటే తాను ఆచరించి చూపాలి. తానే ఒక స్పూర్తిగా ఉండాలి, తానే అద్దంలా మెరవాలి. తానే నిష్కలంక చరిత్రతో వెల్లి విరియాలి. చీకటి దారుల్లో కూడా వెన్నెలలు పూయించేలా తన ప్రతిభామూర్తిమత్వంతో అణువణువునా సత్తా చాటాలి. నీతులు చెప్పేవాడు నాయకుడు కాదు, వాటిని పాటించేవాడే సిసలైన నాయకుడు. అంతేనా నాయకుడు అంటే వెన్ను చూపనివాడు, వెన్న లాంటి మనసు ఉన్నవాడు. ప్రత్యర్ధులకూ అరవీర భయంకరుడుగా ఉండేవాడు అని చెప్పాలి.

మరి అలాంటి నాయకులు ఎక్కడైనా ఉన్నారా అంటే వర్తమాన కాలంలో బూతద్ధంతో వెతికినా ఏ చోటా కనిపించడంలేదు, అయినా తరచి చూస్తే కనుక అక్కడక్కడ వారి జాడలు కనిపిస్తున్నాయి. వారిని మనం వెతుక్కోవాలంతే. ఇంకా ఉన్నారు, ఈ రోజుకీ ఉన్నారు. అలాంటివారిలో ముందు వరసలో ఉన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఆయనను అంతా ఆప్యాయంగా వీఎస్సార్ అని పిలుస్తారు. ఆయన తాజాగా జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ సీపీఎం కి కొత్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

ఆయన విద్యార్ధి దశ నుంచే ఉద్యమాల బాట పట్టారు, ఆయన ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరు చేస్తారు. ఆయనలో రచయిత ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు. అన్నింటికీ మించి మంచి మనిషి ఉన్నారు. అందుకే ఆయన నాయకుడు అయ్యారు. సరే ఇపుడు మరో విశేషం గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన సీపీఎం లాంటి చరిత్రకెక్కిన పార్టీకి ఏపీ పెద్దగా ఉన్నారు కదా. ఆయన వెనక ఎంత మంది ఉన్నారు. ఆయన బలమేంటి, ఆయన దర్జా, దర్పం సంగతేంటి అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు.

కానీ ఆయన ఎంతో మంది అనుచరులు ఉన్నా కూడా తాను నిరాడంబరుడు. పార్టీకి కోట్లాది రూపాయలు నిధులు ఉంటే ఉండవచ్చు ఆయన మాత్రం సాధారణంగా ఉంటారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్న తరువాత సభా ప్రాంగణం నుంచి ఆయన ఇంటికి బయల్దేరారు. అయితే ఆయన ఎక్కింది అత్యంత ఖరీదైన కారులో కాదు, కేవలం ఒక సాధారణ బైక్ మీదనే. అది కూడా ఆయనది కాదు, ఒక పార్టీ కార్యకర్తది.

అంటే ఆయన ఎంత సింపుల్ లీడరో అర్ధమవుతోంది కదా. ఆయనకు నిబద్ధత ఉంది. సమాజం పట్ల ప్రేమ ఉంది. సమస్యల సాధన పట్ల తపన ఉంది. గుండె నిండా ధైర్యం ఉంది. ఇది చాలు కదా ఆయన్ని నాయకుడు అనడానికి. అంతే తప్ప మందీ మార్బలం ఉంచుకుని బుగ్గ కార్లు ఎక్కి, జనాలను అవే కార్లతో తొక్కించే సగటు లీడర్ల లాంటి వారు కాదు ఆయన. అందుకే ఆయన్ని అంతా చేతులెత్తి దండం పెడుతున్నారు. ఆయన కదరా లీడర్ అంటూ వేయి నోళ్ళ పొగుడుతున్నారు.

ఏపీ సీపీఎం కొత్త సారధిగా బాధ్యతలు చేపట్టిన వీఎస్సార్ మును దు తనదైన దీక్షా దక్షతను పూర్తి స్థాయిలో చూపిస్తారు, ఏపీ జనాలు వాటిని చూస్తారు, ఇంకా ఆయన గురించి చాలానే తెలుసుకుంటారు. ఇక్కడో మాట. సీపీఎం జాతీయ కార్యవర్గంలో ఉన్న సీనియర్ మోస్ట్ నేత బీవీ రాఘవులు సైతం ఇలాగే వెరీ సింపుల్ గా ఉంటారు. ఇలాంటి వారే కదా యువతకు ఆదర్శం, వీరి గురించి కదా జనాలు అంతా కధలుగా చెప్పుకోవాలి.


Tags:    

Similar News