కేఈ వివాదాస్ప‌ద కామెంట్లు..కోట్ల ఎఫెక్టేనా?

Update: 2019-01-31 14:08 GMT
ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నాయని అంటున్నారు. ఓ వైపు చేరిక‌ల ఎత్తుగ‌డ‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కొత్త క‌స‌ర‌త్తు చేస్తుంటే...మ‌రోవైపు ఆ జంపింగ్స్‌ పై పార్టీ నేత‌లు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుత‌న్నారు. ఇందులో భాగంగా ఒకింత న‌ర్మ‌గ‌ర్భంగా త‌మ ఆందోళ‌న‌ను వారు వెలిబుచ్చుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే ఎపిసోడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కోట్ల చేరిక అంశాన్ని నా అంతట నేను సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించబోనని తెలిపారు.

అయితే, ఈ కామెంట్లు చేసిన మ‌రుస‌టి రోజే - ప‌రోక్షంగా ఇంకో రూపంలో త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ తాజాగా అసెంబ్లీలో  మీడియా చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ...తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో టీటీడీ ఇవాళ నిర్వహించిన శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయశాఖ మంత్రినైన తనకు ఆహ్వానం ఇవ్వలేదని మండిపడ్డారు. టీటీడీలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులను దారికి తేవడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని పరిమితులు ఉండి ఉంటాయని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ నియామకం కోసం ఫైలు సీఎం చంద్రబాబుకు పంపి మూడు నెలలైంది.. ప్రజాప్రతినిధుల నుంచి బోర్డ్ విషయంలో ఒత్తిడి వస్తుందని సీఎంకు వివరించానన్నారు. పెద్ద ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే అనేక సమస్యలు వస్తాయన్న కేఈ...దేవదాయ శాఖలో ఉన్నన్ని సమస్యలు ఇంకా ఎక్కడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్టమైన రెవిన్యూ శాఖ కంటే దేవదాయ శాఖ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి దేవదాయ శాఖ వదులుకోవాలని అనిపిస్తోందని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, కోట్ల ఫ్యామిలీ చేరిక ఎపిసోడ్‌ పై కేఈ కృష్ణమూర్తి అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కోట్ల ఫ్యామిలీ చేరిక అంశాన్ని నా వద్ద చంద్రబాబు ప్రస్తావించ లేదని, అందుకే కోట్ల చేరిక అంశాన్ని నా అంతట నేను సీఎం దగ్గర ప్రస్తావించబోనని.. సీఎం ప్రస్తావించినప్పుడే కోట్ల ఫ్యామిలీ చేరికపై నా అభిప్రాయం చెబుతానని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఏ సీట్లు అడుగుతున్నారనే విషయం కూడా నాకు తెలియదన్నారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుపైనే సీఎంతో చర్చించిన మ‌రుస‌టి రోజే ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. టీటీడీపై త‌న‌కున్న అసంతృప్తిని తెలిపేందుకే ఇవాళ వెంకటపాలెంలో జరిగిన ఆలయ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఓవైపు చేరిక విష‌యంలో త‌న‌కు జ‌రుగుతున్న ప‌రాభ‌వం మ‌రోవైపు త‌న సొంత శాఖ‌లోనే గౌర‌వం లేని నేప‌థ్యంలోనే...దేవాదాయ శాఖ వ‌దులుకోవాల‌నే నిర్ణ‌యానికి కేఈ వ‌చ్చారని అంటున్నారు.


Tags:    

Similar News