పెన్షనర్లలో పెరిగిపోతున్న టెన్షన్

Update: 2022-01-30 04:30 GMT
పీఆర్సీ వివాదానికి సంబంధించి ప్రభుత్వం చెప్పినదానికి విరుద్ధంగా జరుగుతోంది. దాంతో ఉద్యోగుల సంగతి ఎలాగున్నా ముందు పెన్షనర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ జీతం పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదంటు ప్రభుత్వం బల్లగుద్దకుండానే చెబుతోంది. జీతాలు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమేని కచ్చితంగా పెరుగుతాయంటు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నుండి మంత్రుల దాకా చెప్పిందే చెబుతున్నారు.

జీతాల పెరుగుదల విషయంలో వీళ్ళు ఎంత భరోసాగా చెబుతున్నా పెన్షనర్లకు మాత్రం జీతాలు తగ్గుతాయనే తెలుస్తోంది. ఎందుకంటే కొత్త పీఆర్సీ ప్రకారం  పెన్సనర్లకు అందాల్సిన జీతాల బిల్లలను ట్రెజరీలు రెడీ చేస్తున్నాయి. దాని ప్రకారం రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు తమ  పే స్లిప్పులు ఆన్ లైన్లో చూసుకుంటున్నారు. అలా చూసుకున్న కొందరికి పెద్ద షాక్ తగిలింది. ఎలాగంటే డిసెంబర్ పెన్షన్ తో పోల్చుకుంటే ఫిబ్రవరిలో అందుకోబోయే పెన్షన్ కనీసం రు.  5 వేలు తగ్గుదల కనిపిస్తోంది.

పే స్లిప్పులు రెడీ అయిపోయాయంటే రేపు ఖాతాల్లో పడే పెన్షన్ కూడా ఇంతే ఉంటుంది. పెన్షన్ లో తగ్గుదల చూసుకున్నవారందరికీ టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఇపుడు ఆన్ లైన్లో కనబడుతున్న పే స్లిప్పుల్లో బేసిక్ కు ఐఆర్ కలపకుండా, 5 డీఏలను కలపకుండానే సంబంధిత శాఖల ఉద్యోగులు పే స్లిప్పులను తయారు చేశారు అంటున్నారు.

దాంతో పెన్షన్లో బాగా తగ్గుదల కనిపిస్తోంది. డిసెంబర్ పే స్లిప్పులో ఉండే డీఏ+ఐఆర్ సుమారుగా రు. 17 వేలు కొత్త పీఆర్సీ ప్రకారం తయారైన పే స్లిప్పులో కనబడలేదు. దాంతో భారీగా పెన్షన్లో కోత పడినట్లు కనబడుతోంది. అందుకనే పెన్షనర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇలా తప్పుల తడకగా పే స్లిప్పులు తయారుచేయటం ప్రభుత్వం తప్పిదమే. పీఆర్సీ పై ఇంతపెద్ద వివాదం నడుస్తున్నపుడు పే స్లిప్పులు తయారుచేసే ఉద్యోగులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు. ఇపుడు పే స్లిప్పుల ప్రకారమే పెన్షన్ పడితే ఆ గ్యాప్ ఎమౌంట్ రావటానికి పెన్షనర్లు నానా అవస్థలు పడాల్సిందే. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని జరిగిన తప్పును ఎంత తొందరగా సరిచేస్తే అంత మంచిది.
Tags:    

Similar News