మహేష్ పై కేసు పెడుతానన్న నరసింహన్

Update: 2019-09-04 09:52 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ.. ఇప్పుడున్న తెలంగాణకు కానీ బలమైన గవర్నర్ ఎవరైనా అంటే అందరూ గవర్నర్ నరసింహన్ అని చెబుతారు. ప్రస్తుతం ఆయనను కేంద్రం గవర్నర్ పదవి నుంచి తొలగించింది. ఇంకా ఎక్కడా పోస్టింగ్ అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రానికి, ఆ తర్వాత తెలంగాణకు గవర్నర్ గా పనిచేసిన ఆయన తన అనుభవాలను చిట్టచివరగా మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా తనను డిక్టేటర్ లా - సర్వాధికారిగా పోలుస్తూ ఉమ్మడి రాష్ట్రంలో మీడియా పతాకశీర్షికన ప్రచురించినప్పుడు ఆశ్చర్యపోయానని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీని విభజించి కేంద్రం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నర్ నరసింహన్ కు సర్వాధికారులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆసమయంలో ఓ తెలుగు టాప్ పత్రిక గవర్నరే సర్వాధికారి అంటూ మహేష్ బాబు ఓ సినిమాలో వేసుకున్న పోలీస్ డ్రెస్ శరీరానికి గవర్నర్ నరసింహన్ తలకాయ అంటించి మొదటి పేజీలో కథనం రాసింది.

ఆ కథనంపై తాజాగా గవర్నర్ నరసింహన్ స్పందించారు. తన జీవితంలోనే పోలీస్ డ్రెస్ వేసుకొని చాలా రోజులైంది. ఎప్పుడో 1972లో అనుకుంటా తాను పోలీస్ గా ఉన్నప్పుడు వేసుకున్నా.. ఆ తర్వాత వేసుకోలేదు.. కానీ నన్ను పోలీస్ బాస్ లా ఆ పేపర్లో వేయడం షాక్ కు గురిచేసిందని నరసింహన్ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత ఒక ఫంక్షన్ లో కలిసిన హీరో మహేష్ బాబుపై ఇదే విషయంపై గవర్నర్ సెటైర్లు వేశారట.. ‘మహేష్ నీపైన నేను ఫోర్జరీ - చీటింగ్ కేసు పెడుతానని చెప్పాను.. నీ శరీరానికి నా తలను అంటించి పేపర్లలో వేశారు.. అందుకే నీ మీద కేసు పెడుతాను’ అని జోక్ చేశానని మహేష్ కు చెప్పాడట గవర్నర్. దీనికి ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారట..

నా జీవితంలో ఇదో మెమరీ అని.. సర్వాధికారి అంటూ నా పోలీస్ డ్రెస్ ఫొటోను పేపర్లలో వేశానని.. మీ తాత ఎంత గొప్పోడో చూడండి అంటూ నా మనవళ్లకు ఇది చూపించి గొప్పగా చెప్పుకుంటానని ఆ ఫొటో గురించి గవర్నర్ నరసింహన్ సరదాగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News