స్కీములు ఆపేస్తేనే స్టేట్ సేఫ్...?

Update: 2022-04-15 05:26 GMT
ఏపీలో పాలన సాఫీగా సాగడం లేదు అన్నది అందరికీ తెలిసిందే. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు వైసీపీ సర్కార్ నవ రత్నాలు పేరిట భారీ పధకాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. మధ్యలో రెండేళ్ళు కరోనా వచ్చి అంతా అతలాకుతలం చేసి పారేసింది. ఇక అప్పుల మీద అప్పులు తెచ్చి సంక్షేమ పధకాలకు పెద్ద ఎత్తున నగదు కుమ్మరిస్తున్నారు.

దీన్ని ప్రణాళికేతర వ్యయంగా బడ్జెట్ లో పేర్కొంటారు. బడ్జెట్ లో నిజానికి ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని అభివృద్ధికి సూచికగా చూస్తారు. అలా ఖర్చు చేసిన దానికి తరువాత కాలంలో అయినా మళ్ళీ తిరిగి ఖజనాకు వస్తుంది. అభివృద్ధి కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

కానీ ఏపీలో చూస్తే ప్రణాళికా వ్యయం గత మూడేళ్లలో పెద్దగా లేదు అనే చెప్పాలి. అంతా  నగదు బదిలీ కిందనే వెళ్ళిపోతోంది. దీని వల్ల అభివృద్ధి అన్నది లేకుండా పోతోంది. మూడేళ్ళ పాటు పంటి బిగువన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించింది. మరో వైపు కేంద్రం కూడా ఏపీ చేస్తున్న అప్పుల మీద ఫోకస్ పెట్టింది. రుణ పరిమితులు కూడా విధిస్తోంది.

అయినా ఆస్తులను కుదువ పెట్టి అప్పులు తెచ్చి సంక్షేమ పేరిట పంచడం మంచిదేనా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఇక ఇంతలా సంక్షేమ పధకాలను అమలు చేసినా జనాలు ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది అతి పెద్ద ప్రశ్న. దీనికి జవాబులు చరిత్ర పుటల్లోకి వెళ్తే తెలుస్తాయి. సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేసింది. వాటికి ఒక విధంగా శ్రీకారం చుట్టింది ఎన్టీయార్.

అలాంటి ఎన్టీయార్ 1989లో దారుణంగా ఓడిపోయారు. అంటే జనాలు పాలన చూస్తారు తప్ప తాయిలాలు కాదు అని అర్ధమవుతోంది. ఇక ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వచ్చినవే. ఇక చంద్రబాబు విషయమే తీసుకుంటే 2014 నుంచి 2019 దాకా అనేక  సంక్షేమ పధకాలు అమలు చేశారు. కానీ టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి.

నిజానికి ఎన్నికల్లో గెలుపునకు తాయిలాలకు పూర్తిగా సంబంధం లేదు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు ఇంతకంటే రెట్టింపు తమ పాలనలో తాయిలాలు ఇస్తామని చెబితే అపుడు వైసీపీకి జనాలు ఓటు వేస్తారా.  అందువల్ల తాయిలాలు అన్నవి ఎపుడూ ఓట్లను రాల్చవు. రాల్చినా అవి టెంపరరీగానే.

ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఇక మూడేళ్ళ పాలన మే 30తో పూర్తి అవుతున్న వేళ వైసీపీ సమీక్ష చేసుకోవాలి. స్కీములను కొనసాగించాలా వద్దా అన్న దాని మీద కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే విధంగా రానున్న రెండేళ్ల కాలంలో అభివృద్ధి మీద ఖర్చు చేస్తే ఏపీ బాగుపడుతుంది. దాన్ని చూపించి దర్జాగా ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. ప్రగతి అన్నది ఏ ఒక్కరి ఇంట్లోకి ఇచ్చే తాయిలం కాదు, అది అందరూ అనుభవించేది.

మరి మాట తప్పను, మడమ తిప్పను కాబట్టి ఇస్తూనే పోతాను అని జగన్ సర్కార్ అనుకుంటే మాత్రం ఇంకా అప్పుల ఊబిలోకి ఆంధ్రా వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పటికే అనధికార లెక్కల ప్రకారం ఏపీ అప్పు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల పై చిలుకు ఉందని అర్ధమవుతోంది. అందువల్ల భవిష్యత్తుని దృస్టిలో పెట్టుకుంటే ప్రభుత్వానికి ఈ అప్పుల తిప్పలు తప్పుతాయి. మంచి పేరు కూడా వస్తుంది
Tags:    

Similar News