జగన్ గ్రేట్..వైఎస్ తో పాటు చనిపోయిన ఐఏఎస్ డాటర్ కు జాబ్

Update: 2019-07-04 16:54 GMT
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజంగానే గ్రేట్ అనిపించుకున్నారు. ఎప్పుడో పదేళ్ల నాడు తన తండ్రి మరణించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ కుటుంబానికి ఇప్పుడు జగన్ బాసటగా నిలిచారు. 2009లో ఉమ్మడి ఏపీకి వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల ఫారెస్ట్ లో చోటుచేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో వైఎస్ తో పాటు ఆయనకు కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా ప్రాణాలు కోల్పోయారు.

తండ్రి మరణంతో తీవ్ర శోకంలో మునిగిపోయిన జగన్... తండ్రి అంత్యక్రియలు ముగిసిన మరుక్షణమే... సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. నాడు ప్రకటించినట్టుగానే నేడు ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్... సుబ్రహ్మణ్యం కుమార్తె సింధూ సుబ్రహ్మణ్యంకు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింధూను గ్రూప్ 1 అదికారిణిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదంలో మరణించే అధికారుల కుటుంబాలకు బాసట అందించే క్రమంలో వారి పిల్లలకు వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధన మేరకే చాలా మంది ఐఏఎస్ - ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు బాసటగా నిలిచిన ప్రభుత్వాలు వారి పిల్లలకు సర్కారీ కొలువులను అందించాయి.

అయితే వైఎస్ తో మరణించిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి బాసటగా నిలిచే విషయంలో నాటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులతో పాటు గడచిన ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా దృష్టి సారించిన పాపాన పోలేదు. అయితే ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే... ఇలాంటి విషయాలపై దృష్టి సారించిన జగన్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి బాసటగా నిలిచారు. విధి నిర్వహణలో సీఎంగా ఉన్న తన తండ్రి వెంట సెక్రటరీగా వెళ్లిన ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ చర్యతో జగన్ నిజంగానే తనను తాను గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నారు.

గ్రాడ్యుయేట్ అయిన సింధూ సుబ్రహ్మణ్యానికి గ్రూప్ 1 ఉద్యోగమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కేసు కింద పరిగణిస్తూ ఆమెకు ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
Tags:    

Similar News