లోటు భర్తీకి ప్రజలపై భారం: ఏపీలో విద్యుత్ చార్జీలు పెంపు

Update: 2020-02-10 10:08 GMT
ప్రజలపై మోయలేని భారం పడింది. విద్యుత్ చార్జీల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది. మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించగా తాజాగా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచింది. ఆంధ్రప్రదేశ్‌ లో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. యూనిట్‌ కు 90 పైసల చొప్పున ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది. అయితే 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే ఈ పెంచిన ఛార్జీలు వర్తించనున్నాయి.

ఈ చార్జీల పెంపుతో ప్రభుత్వ - కార్పొరేట్ సంస్థలపై భారం పడనుంది. 500 యూనిట్లు పైబడిన వారికి రూ. 9.05 నుంచి రూ.9.95గా టారిఫ్‌ పెంచారు. దీంతో 1.45 కోట్ల గృహ వినియోగదారుల్లో 1.30 లక్షల గృహ వినియోగదారులపై భారం పడనుంది. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఏపీ ఈఆర్సీ చైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏపీ తూర్పు - దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి రూ.14,349.07 కోట్లు ఆదాయం అవసరమని అంచనా వేశారు. దీనిలో భాగంగా లోటును భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలు పెంచినట్లు వివరణ ఇచ్చారు. పెంచిన చార్జీలతో ప్రభుత్వ సంస్థపై రూ.13 కోట్ల భారం పడుతుందని తెలిపారు.


Tags:    

Similar News