ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో ప్రభుత్వం కీలక మార్పులు ... హైటెక్, లోటెక్.. నోటెక్

Update: 2020-07-06 15:00 GMT
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. వైరస్ వల్ల పాఠశాలలన్నీ మూతపడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. బ్రిడ్జి కోర్సుల ద్వారా ప్రభుత్వ పాఠవాల విద్యార్థులందరికీ పాఠ్యాంశాలను బోధించాలని నిర్ణయించుకుంది. హైటెక్, లోటెక్, నో టెక్ పద్ధతుల రూపంలో బ్రిడ్జి కోర్సుల ద్వారా బోధనను కొనసాగించే దిశగా చర్యలను తీసుకున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరం ఇంకా ఆరంభం కాలేదు.

వచ్చే నెల 3వ తేదీ నుంచి పాఠశాలలను పునరుద్ధరిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా మరి కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన అనంతరం తరగతులను పరిమితంగా నిర్వహించాలని భావిస్తోంది. నిజానికి వచ్చేనెల 3వ తేదీ నుంచి పాఠశాలలను పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ.. దీన్ని ముందుకు తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచే పునః ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ఈ దిశగా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులను కూడా జారీ చేశారని అంటున్నారు. ఆగస్టు 3 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం వల్ల కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ తేదీని ముందుకు తీసుకొచ్చారని సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించిన తరువాత పరిమితంగా తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన్లు చెబుతున్నారు. ప్రాథమిక విద్యార్థులకు వారంలో ఒకరోజు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు వారంలో రెండురోజుల పాటు తరగతులను నిర్వహిస్తారని సమాచారం.

విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఒక నెల కాలాన్ని విద్యార్థులు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశాలు, ఇతర సిలబస్‌ను బ్రిడ్జి కోర్సుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. హైటెక్, లోటెక్, నో టెక్ పద్ధతుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే దిశగా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. స్మార్ట్ ‌ఫోన్ సౌకర్యం ఉన్న విద్యార్థులకు ఆన్ ‌లైన్ ద్వారా పాఠ్యాంశాలను బోధించడం, ఆ సౌకర్యం లేని వారికి టీవీల ద్వారా చదువు చెప్పేలా సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
Tags:    

Similar News