ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వాణీమోహన్ ..!

Update: 2020-06-03 07:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా జి. వాణీమోహన్ ‌ను నియమిస్తూ జగన్ సర్కార్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సహకార శాఖ కమిషనర్ ‌గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ కిందటి నెల 30వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వాణీ మోహన్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని హెచ్ ఓ డీ భవనంలో గల కార్యాలయంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు

ఆమె ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటుగా సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌ గా అదనపు బాధ్యతలు చేపడతారని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో తెలిపారు.ఇకపోతే , నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్‌ ను నియమించడం, అయిదేళ్ల కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని రావడం, చకచకా సాగిపోయినప్పటికీ.. హైకోర్టు జోక్యంతో దీనికి బ్రేక్ పడింది.

హైకోర్టు ఆదేశాలతో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా  పునర్నియమించడానికి లైన్ క్లియర్ అయినట్టేనని భావించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినట్లు గతవారం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. శ‌నివారం వాటిని వెనక్కి తీసుకున్నారు. ఆయన నియామకం చెల్లదంటూ ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎస్ ‌ఈసీ కార్యదర్శి పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. త్వరలోనే ఇది విచారణకు రానుంది. చూడాలి మరి సుప్రీం కోర్టులో దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో ..
Tags:    

Similar News