ఆర్ ఎంపీలకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

Update: 2020-04-11 12:10 GMT
కరోనా వ్యాప్తిని నియంత్రించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గ్రామాలు, పట్టణాల్లో విస్తారంగా ఉన్న  ఆర్ఎంపీలకు ఒక సూచనతోపాటు హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు జలుబు - దగ్గు - మరియు జ్వరం ఉంటే  వారికి చికిత్స చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ ఎంపి) లను ఆదేశించింది. అలాంటి రోగుల గురించి  ప్రభుత్వానికి, సమీప ప్రభుత్వ వైద్య బృందాలకు  తప్పకుండా తెలియజేయాలని ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వం  శనివారం జారీ చేసిన ఉత్తర్వులలో కొన్ని కీలక సూచనలను చేసింది. చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆర్‌ ఎంపీలు జలుబు - దగ్గుతో వస్తున్న రోగులకు  చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆ లక్షణాలు కరోనా లక్షణాలు కావడంతో పెద్ద ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఉంటుంది. అందుకే అలాంటి వారు కనిపిస్తే వెంటనే స్థానిక వైద్య అధికారులకు తెలియజేయాలని ఆర్‌ ఎంపీలకు ఏపీ ప్రభుత్వం సూచించింది.

ఇక రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక కరోనా ఆసుపత్రిని కేటాయించారు. అదనంగా, నాలుగు రాష్ట్ర స్థాయి కరోనా ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఈ లక్షణాలతో ఏదైనా రోగి ఆఎంపీల వద్దకు వస్తే ఈ ఆసుపత్రులలో దేనినైనా అప్రమత్తం చేయాలని సూచించింది. అటువంటి రోగులకు చట్టవిరుద్ధంగా మరియు అనధికారికంగా చికిత్స చేస్తున్న ఆర్ఎంపీలపై కఠిన చర్యను తీసుకుంటామని హెచ్చరించింది.

ఏపీలో శనివారం వరకు 381 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం  18 కొత్త కేసులు నమోదయ్యాయి. అనేక ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాలలో లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు.
Tags:    

Similar News