నీతులు చెప్పే వర్ల.. ఇదేం పద్దతయ్యా?

Update: 2019-09-28 06:12 GMT
దేనికైనా లిమిట్ ఉంటుంది. అందునా.. టీవీ కెమేరాల ముందుకు తరచూ వచ్చి నీతులు వల్లించే వారి మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర లేచించి మొదలు ఆదర్శాలు వల్లించే నేతలు.. మాటలకే కాదు.. చేతల్లోనూ చూపించాల్సిన అవసరం ఉంది. మాట్లాడటమే కానీ.. వాటిని ఆచరించే విషయంలో తాము ఎప్పుడూ వెనుకే అన్నట్లు వ్యవహరించే టీడీపీ నేతలకు తగ్గట్లే తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యవహరిస్తున్నారు.

బాబు పవర్లో ఉన్నప్పుడు ఆయన్ను ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించారు. బాబు ప్రభుత్వం పోయి.. జగన్ సర్కారు వచ్చి వంద రోజులు దాటిపోయింది కూడా. సాధారణంగా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారంతా.. ప్రభుత్వం మారినంతనే.. తమ పదవులకు రాజీనామాలు చేసేస్తుంటారు. ఒకవేళ చేయకుండా ఉంటే.. వారిని తగిన రీతిలో ఇంటికి పంపే ప్రయత్నం చేస్తుంటాయి కొత్త ప్రభుత్వాలు.

అయితే.. జగన్ ప్రభుత్వం కొలువు తీరి దగ్గర దగ్గర నాలుగు నెలలు కావొస్తున్నా.. ఇప్పటికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన వైదొలగలేదు. కాస్త టైమిస్తే చూసుకొని పదవి నుంచి వీడతారని భావించినా.. అలాంటిదేమీ జరగకపోగా.. చివరకు పదవి నుంచి తొలగించే వరకూ విషయాన్ని తీసుకెళ్లిన ఘనత వర్ల సొంతమని చెప్పాలి. ఎంతకూ వదలని పదవి నుంచి ఆయన్ను తప్పించేందుకు ఏపీ సర్కారు తాజాగా నోటీసు జారీ చేసింది.

నెల వ్యవధిలో ఆయన్ను పదవి నుంచి వైదొలగాలని కోరింది. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన పుట్టా సుధాకర్ యాదవ్ సైతం ఇదే తీరును ప్రదర్శించారు. ఆయనకు పలుమార్లు చెప్పినా పదవి నుంచి తప్పుకోలేదు. దీంతో.. బలవంతంగా ఆయన్ను పక్కకు తప్పించాల్సి వచ్చింది. తాజాగా వర్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకునేలా ఉందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News