జగన్ అంత పని చేస్తారా ?

Update: 2022-01-30 04:30 GMT
పీఆర్సీ వివాదానికి ముగింపు పలికే నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వివాదంపై చర్చలు జరుపుకుందామని, పరిష్కరించుకుందామని మంత్రుల కమిటీ ఉద్యోగుల నేతలను ఆహ్వానిస్తున్నారు. వరుసగా నాలుగు రోజులు ఉద్యోగ నేతల కోసం ఎదురుచూసినా నేతలు మాత్రం కనబడలేదు.

దాంతో విసిగిపోయిన మంత్రులు ఇకనుండి తాము నేతలతో భేటీకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. నేతలు తమంతట తాముగా వస్తేనే చర్చలకు సిద్ధమని మంత్రులు చెప్పేశారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జీతాల కోసం బిల్లులు పెట్టుకుని ఉద్యోగులకు, పెన్షన్ల బిల్లలు పెట్టిన రిటైర్డ్ ఉద్యోగులకు జీతాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఉద్యోగుల నేతలు ట్రెజరీ ఉద్యోగులను అడ్డుకుంటన్నారంటు ప్రభుత్వం మండిపోతోంది.

అందుకనే జీతాల బిల్లులు ప్రాసెస్ చేయకపోయినా, చేయకుండా అడ్డుకున్నా సదరు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టిగానే హెచ్చరించింది. అవసరమైతే ఒకపుడు తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించిన తీరులోనే వెళ్ళటానికి జగన్ కూడా డిసైడ్ అయ్యారంటు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే ఉద్యోగులపైన ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మైన్ టెనెన్స్ యాక్ట్) ను ప్రయోగించేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

2003లో తమిళనాడులో జయలలిత ఇదే పనిచేశారు. ప్రభుత్వం మాట వినకుండా సమ్మెలోకి వెళ్ళినందుకు అప్పట్లో జయలలిత ఒకేసారి 3.5 లక్షల మందిని ఉద్యోగాల్లో నుండి తొలగించారు. దానిపై ఉద్యోగ నేతలు కోర్టుకు వెళ్ళినా జోక్యం చేసుకోవటానికి కోర్టు ఇష్టపడలేదు. ప్రభుత్వంతోనే మాట్లాడుకుని సమస్యను సర్దుబాటు చేసుకోమని కోర్టు సూచించింది. దాంతో వేరేదారి లేక ఉద్యోగులు జయలలితతో కాళ్ళబేరానికి వెళ్ళి సమ్మె విరమించుకున్నారు. భవిష్యత్తులో మళ్ళీ సమ్మె చేయబోమని ప్రతి ఎంప్లాయి విడివిడిగా అఫిడవిట్ ప్రభుత్వానికి ఇచ్చుకున్నాక కానీ జయలలిత ఉద్యోగంలోకి తీసుకోలేదు.

ఇపుడు జగన్ కూడా అదే పనిచేయచ్చు. ఎందుకంటే ఉద్యోగులకు సమ్మె చేసే హక్కులేదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. ఇదే విషయాన్ని ఇపుడు హైకోర్టు కూడా గుర్తుచేసింది. అయినా జగన్ ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకోవటం లేదు. దాన్నే ఉద్యోగుల నేతలు అలుసుగా తీసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News