‘చెత్త’ నిర్ణయానికి షాకిచ్చిన జగన్ సర్కారు

Update: 2020-12-28 04:15 GMT
ప్రభుత్వంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు చూపించాలా? అంటే.. లేదనే చెప్పారు. ప్రభుత్వంపైన కంటే కూడా.. తన ప్రొఫెషన్ పైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తే.. ఏ సమస్యా ఉండదు. అందుకు భిన్నంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇదే విషయం తాజాగా రుజువైంది కూడా. అవసరానికి మించిన ఉత్సాహాన్ని ప్రదర్శించి.. దారుణ నిర్ణయాన్ని తీసుకున్న ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ పై జగన్ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.  

తాజా ఎపిసోడ్ లో కేంద్రమంత్రి నేరుగా సీన్లోకి రావటం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో.. తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. క్రిష్ణా జిల్లా ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ ప్రకాష్ రావు వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వటానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావటం లేదు. దీనికి నిరసనగా.. కొందరు అధికారులు అతిగా స్పందించారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకుల తీరుకు నిరసనగా.. బ్యాంకుల ఎదుట చెత్త పోయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ తీరు మరింత వివాదాస్పదంగా మారింది. బ్యాంకు ముందు భారీగా చెత్త పోయించటమే కాదు..జగనన్న తోడు.. వైఎస్సార్ చేయూత పథకాలకు రుణాలు ఇవ్వనందుకు నిరసనగా తాము చెత్త పోసినట్లుగా సదరు బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా బోర్డులు పెట్టించారు. దీనిపై స్పందించిన బ్యాంకులు.. ఈ వ్యవహారంపై కేంద్రానికి తీసుకెళ్లింది.

దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. ఈ తీరు ఏ మాత్రం సరికాదని చెప్పటంతో పాటు..దీనికి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఉయ్యూరు పంచాయితీ కమిషనర్ ను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారుల సంఘానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ లేఖ రాశారు. చెత్త వేసిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తన వరకు వచ్చిన వెంటనే చెత్తను ఎత్తేయించినట్లుగా చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ చెత్త వ్యవహారం కేంద్రం.. రాష్ట్రాల మధ్య కొత్త లొల్లికి కారణమైంది. దీంతో.. స్పందించిన రాష్ట్ర సర్కారు.. ఇలాంటి అతిని తాము ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్న విషయాన్ని తాజా నిర్ణయంతో స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News