తానా సభల వేళ... కోమటి జయరాంపై జగన్ వేటు

Update: 2019-07-04 14:36 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన నాడు సీఎంఓలోని నలుగురు ఐఏఎస్ లను బదిలీపై పంపిన జగన్... ఆ తర్వాత కూడా చాలా మంది అధికారులను బదిలీ చేసేశారు. ఆ బదిలీల్లో భాగంగా ఇప్పుడే అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాంను ఆ పదవి నుంచి తప్పిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

టీడీపీకి ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కోమటి జయరాంను అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవి నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చినా... ఏటా అట్టహాసంగా జరిగే తానా సభలు ప్రారంభమైన వేళ జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అమెరికాలోని ప్రవాస తెలుగు ప్రజలకు సంబంధించిన కీలక సంఘంగా ఉంది. తెలుగు ప్రజల కష్టసుఖాల్లో కీలక భూమిక పోషిస్తున్న తానా... ఏటా నిర్వహించే వార్షిక సభలను చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వేడుకలు కూడా గురువారమే అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ వేడుకలకు అటు తెలంగాణ నుంచే కాకుండా ఇటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.

ఈ జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అంటే తానా సభల నేపథ్యంలో సంబరాలు మొదలైన వేళ... తానాకు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కోమటి జయరాంను జగన్ సర్కారు అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగానే సంచలన విషయంగానే చెప్పాలి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి సంబంధించి విదేశీ వ్యవహారాలు, ప్రత్యేకించి అమెరికా వ్యవహారాల్లో జయరాం కీలకంగా వ్యహరించిన సంగతి తెలిసిందే. మరి జయరాంను ఆ పదవి నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్... ఆ పదవిలో ఇంకెవరిని నియమిస్తారన్న విషయంపై ఆసక్తికర చర్చ మొదలైంది.


Tags:    

Similar News