ట్విట్టర్ కు ఏపీ హైకోర్టు వార్నింగ్

Update: 2022-01-31 11:48 GMT
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, సమాచార విప్లవంలో భాగంగా కొందరు సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకుంటుంటే..మరికొందరేమో దానిని దుర్వినియోగం చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందికదా అని జడ్జిలపై సైతం అనుచిత పోస్టులు పెడుతూ తప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే, అటువంటి వారిపై న్యాయస్థానాలు కూడా కొరడా ఝుళిపిస్తున్నాయి. న్యాయమూర్తులను కించపరుస్తూ, న్యాయవ్యవస్థను అవమానించేలా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ, సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఆదేశిస్తున్నాయి.

ఈ క్రమంలోనే న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని ట్విట్టర్ కు ఏపీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ట్విట్టరుపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ట్విట్టర్ లో కొందరు పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ...అవి మరలా వస్తున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విపిన్ అని టైప్ చేస్తే ఆ పోస్టులు వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ తీసుకువచ్చారు.

ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్ ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే పోలీసులను పంపి స్వా ధీనం చేసుకునేలా ఉత్తర్వులిస్తామని తేల్చి చెప్పింది. అంతేకాదు, న్యాయమూర్తులపై, న్యాయస్థానాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన విదేశాల్లోని వ్యక్తులను ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని సీబీఐని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం కోర్టుల‌పైనా, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ పోస్టులు పెట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జ‌డ్జిల‌పై వివాదాస్ప‌ద పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్ పై పలు కేసులు నమోదు కాగా...సీబీఐ విచార‌ణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని హైకోర్టు నిలదీసింది. ఎప్పటిలోపు అరెస్టు చేస్తారో చెప్పాలని సీబీఐ అధికారులను నిలదీసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన విచారణలో సైతం విదేశాల్లో ఉన్న వ్యక్తుల అరెస్టులపై హైకోర్టు స్పందించింది.
Tags:    

Similar News