కాంట్రాక్టర్లకు శఠకోపం... హైకోర్టు కోపం

Update: 2022-03-08 16:49 GMT
అభివృద్ధి జరగాలంటే ఇసుక సిమెంట్ ఉంటే సరిపోదు, ఆ రెండింటినీ కలిపే కాంట్రాక్టర్ కూడా  ఉండాలి. కాంట్రాక్టర్లు పచ్చగా ఉన్న చోట డెవలప్మెంట్ అన్నది  ఫుల్ గా జరిగింది అని అర్ధం. ఇదే ప్రగతికి గీటురాయి. మరి ఏపీలో ఆ పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పడానికి కాంట్రాక్టర్ల నిత్య  రోదన, వేదనలే కారణం.

 నాలుగేళ్ళుగా మా బిల్లులు ఇవ్వండి  మహా ప్రభో అంటూ వారు నెత్తీ నోరూ పెద్దల ఎదుట  మొత్తుకుంటున్నారు. కొందరు అయితే అప్పుల పాలు అయి భవిష్యత్తు మీద బెంగతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఈ నేపధ్యంలో మరో మార్గం లేక న్యాయం కోరుతూ ఇంకొందరు కాంట్రాక్టర్లు హై కోర్టుకు వెళ్లారు. ఇక దీని మీద తాజాగా జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు గట్టిగానే ప్రభుత్వం మీద ఆగ్రహించింది. కాంట్రాక్టర్లు  బిల్లులు చెల్లించకపోతే ఎలా. మళ్లీ వారు పనులు చేయడానికి ముందుకు  రావాలి కదా అంటూ పేర్కొంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా అని హైకోర్టు ప్రభుత్వానికి గట్టిగానే చీవాట్లు పెట్టింది.

ఇక ఈ విషయం మీద వివరణ ఇవ్వడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టుకు వెళ్లారు. ప్రాధాన్యత క్రమంలో బిల్లులను చెలిస్తున్నామని ఆయన చెప్పిన మాటల మీద హై కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తొమ్మిదవ ప్రాధాన్యతగా కాంట్రాక్టర్లు బిల్లులను చెల్లింపులను  ఉంచడం ఎంతవరకూ సమంజసమని కూడా పేర్కొంది.  సకాలంలో బిల్లులు చెల్లించేలా ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఉన్నత న్యాయం స్థానం ప్రభుత్వాన్ని ఆదేశించడం విశేషం.

ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన పనులతో పాటు ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన పనులకు గానూ ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా తాము పనులు చేయరాదని తీర్మానించడం విశేషం.

మొత్తానికి చూస్తే అభివృద్ధి లేమి ఏపీలో ఉందని ఒక వైపు విపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ కాంట్రాక్టర్లు కూడా సర్కార్ తో ససేమిరా అనడం అంటే ఇక ప్రగతి గతి ఏంటో అర్ధం చేసుకోవాల్సిందే. ఇంకో వైపు వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఎన్నడూ లేని విధంగా ఏపీలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా  అయిపోయింది.
Tags:    

Similar News