ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర నిర్మాణాలపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-23 05:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, సచివాలయాలను నిర్మించడంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై గతంలోనే పలుమార్లు హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తొలగించాలని లేదంటే వాటిని విద్యావసరాలకు వినియోగించాలని సూచించింది. అయితే ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి సహా సంబంధిత ఇతర ముఖ్య అధికారులను కోర్టుకు పిలిపించి తాజాగా హైకోర్టు వివరణ కోరింది.

పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు న్యాయస్థానం సరైన ఉత్తర్వులిచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 63 చోట్ల సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించామన్నారు. 57 చోట్ల ఆ భవనాలను పాఠశాలలకే అప్పగించామని వెల్లడించారు. వాటిని తరగతి గదులుగా, ఇతర అవసరాలకు స్కూళ్లు వాడుకుంటున్నాయన్నారు. కోర్టు అనుమతిస్తే.. అసంపూర్ణంగా ఉన్న భవనాలను కూడా పూర్తిచేసి విద్యా అవసరాలకు వినియోగిస్తామని అని చెప్పారు. మూడు శాఖలతో ముడిపడినందున కోర్టు ఆదేశాల అమలులో జాప్యమైందని, మరోసారి ఇలా జరగనివ్వబోమంటూ సీఎస్‌ క్షమాపణలు కోరారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో నిర్మించిన ఇతర స్థలాలను విద్యా శాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉండగా వీటిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆర్బీకేలతో పాఠశాలల్లో వాతావరణం గందరగోళంగా ఉందని న్యాయవాది లక్ష్మీ నారాయణ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను పలుమార్లు విచారించిన «హైకోర్టు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యా శాఖకు అప్పగించాల్సిందేనని పేర్కొంది.  

ఈ సందర్భంగా హైకోర్టు.. అధికారులకు పలు ప్రశ్నలు సంధించింది. పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేముందు పాఠశాల అభివృద్ధి, తల్లిదండ్రుల కమిటీలతో చర్చించారా? అని ప్రశ్నించింది. విద్యార్థులకు అసౌకర్యమని, అక్కడ వేరే నిర్మాణాలు చేపట్టవద్దని 2020 జూన్‌లో ఉత్తర్వులిచ్చామని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి కట్టినందున అవి అక్రమ నిర్మాణాలేనని హైకోర్టు కుండబద్దలు కొట్టింది.  ఇప్పటికీ 239 చోట్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయంటున్నారని.. వాటి సంగతేంటో చెప్పాలని అధికారులను నిలదీసింది.

 'మీరెక్కడ చదువుకున్నారో తెలియదు కానీ, అబ్దుల్‌ కలాం, వెంకయ్యనాయుడు, నరేంద్ర మోదీ వంటి ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానికి ఎందుకంత చులకనభావన?' అని హైకోర్టు.. సీఎస్‌కు ఘాటు ప్రశ్నలు సంధించింది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News