ఏపీ భూసేక‌ర‌ణ బిల్లుకు మోడీ స‌ర్కారు ఓకే

Update: 2018-04-13 10:45 GMT
ఎక్క‌డైనా సంబంధాలు స‌రిగా ఉన్న‌ప్పుడు ప‌నులు వెంట‌వెంట‌నే జ‌రుగుతుంటాయి. తాజాగా అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి చోటు చేసుకుంది. మోడీ స‌ర్కారుతో క‌టీఫ్ కాక ముందే ఏపీ అసెంబ్లీ ఆమోదించి పంపిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూసేక‌ర‌ణ బిల్లు 2017కు కేంద్రం లైన్ క్లియ‌ర్ చేసింది. ఈ బిల్లును త్వ‌ర‌లో రాష్ట్రప‌తి ఆమోదం కోసం పంప‌నున్నారు. ఈ అంశంపై ఏపీ అధికారుల‌కు కేంద్రం స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

2017 న‌వంబ‌రులో ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అప్పుడు కేంద్రానికి పంప‌గా.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ క్లియ‌ర్ కాలేదు. ఈ బిల్లు కేంద్రం ఓకే అన‌టం వెనుక పెద్ద త‌తంగ‌మే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టంలోని అనేక క్లాజుల్ని మిన‌హాయిస్తూ 2016లో కేంద్రం ప్ర‌త్యేక ఆర్డినెన్స్ ద్వారా భూసేక‌ర‌ణ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. అయితే.. దానిని చ‌ట్ట‌రూపంలో తేలేని నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చేసి కేంద్ర ఆమోదానికి పంపాయి. ఇదే రీతీలో ఏపీ స‌ర్కారు కూడా పంపింది.

ఏపీ అసెంబ్లీ పాస్ చేసిన ఏపీ భూసేక‌ర‌ణ బిల్లు 2017ను కేంద్రానికి పంపినా.. అక్క‌డ నుంచి ఆమోద‌ముద్ర ప‌డ‌క‌పోవ‌టంపై ఏపీ స‌ర్కారు అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. దీన్ని ఓకే చేయించుకోవ‌టం కోసం ప్ర‌య‌త్నించినా సానుకూల ఫ‌లితం రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారుల‌తో భేటీ అయ్యారు.

ఈ బిల్లు వ్య‌వ‌సాయ శాఖ‌లో పెండింగ్ లో ఉన్న విష‌యాన్ని గుర్తించిన అధికారులు.. ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెవెన్యూ శాఖ ఓఎస్డీ రాంప్ర‌సాద్‌.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి స‌త్య‌పాల్ చౌహాన్ తో భేటీ అయ్యారు. 2017 ఏపీ భూసేక‌ర‌ణ బిల్లు పెండింగ్ లో ఉంచ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఇదే త‌ర‌హాలో భూసేక‌ర‌ణ బిల్లు రూపొందించిన గుజ‌రాత్‌.. తెలంగాణ బిల్లుల్ని ఆమోదించార‌ని.. ఏపీది మాత్రం పెండింగ్ లో ఉంచిన వైనాన్ని తెర మీద‌కు తెచ్చారు.

మిగిలిన రాష్ట్రాల్ని ఓకే చేసిన‌ప్పుడు ఏపీ బిల్లు ఎందుకు పెండింగ్ లో ఉంచాన్న ప్ర‌శ్న‌కు అధికారులు బ‌దులిస్తూ.. ఏపీలోని బిల్లులో ఆహార‌భ‌ద్ర‌త‌.. సామాజిక ప్ర‌భావం లాంటి క్లాజుల్ని మిన‌హాయించార‌ని.. అందుకే బిల్లుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లుగా వివ‌రించారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ.. ఈ రెండు క్లాజుల్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎత్తివేసింద‌ని.. అందుకే తాము కూడా తీసేసిన‌ట్లుగా ఏపీ అధికారులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బిల్లును ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రప‌తి ఆమోదానికి పంపుతామ‌ని ఏపీ అధికారుల‌కు స‌త్య‌పాల్ చౌహాన్ హామీ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రప‌తి ఆమోదం వెంట‌నే జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. మిత్రుడిగా ఉన్న‌ప్పుడు ఆల‌స్య‌మైనా.. త‌ప్పు ప‌ట్టే వీల్లేని ప‌రిస్థితి. తాజాగా ట‌ర్మ్స్ స‌రిగా లేనందున ఏ మాత్రం ఆల‌స్య‌మైనా..త‌మ‌తో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగానేకేంద్రం తొక్కి ప‌ట్టిందంటూ వేలెత్తి చూపించే వీలుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ బిల్లుకు ఎలాంటి ఆవాంత‌రాలు లేకుండా రాష్ట్రప‌తి ఆమోద‌ముద్ర త్వ‌ర‌లోనే ప‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News