ఏపీలో మరణమృదంగం - ఒక్క రోజే 37 మంది మృతి

Update: 2020-07-13 17:35 GMT
ఏపీలో ప్రతిరోజు కరోనా వ్యాప్తి అంకంతకు పెరుగుతోంది. పైగా వైరస్ విలయ తాండవం చేస్తుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. ఇంతవరకు కేసులే పెరుగుతూ వచ్చాయి. కానీ ఈరోజు ఏకంగా మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రికార్డు స్థాయిలో 37 మంది మరణించడం గమనార్హం. ఇది ప్రజల్లోను, ప్రభుత్వంలోను కలవరానికి కారణమైంది. అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయారు.

గత 24 గంటల్లో ఏపీలో 1935 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొంది. ప్రతి రోజు డిశ్చార్జి కేసుల కంటే కొత్త కేసుల సంఖ్యే ఎక్కువగా ఉండటం విచారకరం. కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 31 వేలు దాటింది. డిశ్చార్జి అయిన కేసులు 16,464 ఉండగా... ఇప్పటి వరకు మొత్తం 365 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,274 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

తాజాగా 19,247 మందికి పరీక్షలు నిర్వహించగా... ఇంతవరకు చేసిన మొత్తం పరీక్షలు 11,73,096. ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నా కరోనా వ్యాప్తి వేగంగా పెరగడమే ఆందోళనకరం. ప్రజల్లో జాగ్రత్త పెరగనంత వరకు ప్రభుత్వం ఏం చేసినా అది చాలదు. ప్రతి ఒక్కరు ఇతరుల నుంచి భౌతిక దూరం పాటించడం, అనవసరపు తిరుగుళ్లు మానేయడమే దీనికి మందు.
Tags:    

Similar News