మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ...!

Update: 2021-11-17 08:34 GMT
ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లోనూ వైసీపీ హవా కొనసాగిస్తోంది. ఎన్నికలు జరిగిన12 మున్సిపాలిటీలు ఏవంటే .. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి , గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల ,పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లాలో కుప్పం , కర్నూలు జిల్లాలో బేతంచర్ల ,కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట ,అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 12 మున్సిపాలిటీలకు గానూ 9 మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం, కడప జిల్లా రాజంపేట, కమలాపురం, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం, అనంతపురం జిల్లాలో పెనుకొండ, కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలని అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ని అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.

కమలాపురం: ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15, 16, 17,18, 20 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కేతనం ఎగరవేశారు. కమలాపురం మునిసిపల్ తొలి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం విశేషం. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 3 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలవడంతో రీ కౌంటింగ్ నిర్వహించారు.

రాజంపేట : కడప జిల్లా రాజంపేట లో వైసీపీ హవా చాలా స్పష్టంగా కనిపించింది. రాజంపేట లో మున్సిపాల్టీని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 29 స్థానాల్లో వైసీపీ 24 గెలవగా, టీడీపీ 4 ,ఇతరులు ఒకటి దక్కించుకున్నారు.

కుప్పం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 25 వార్డులున్న కుప్పం కౌన్సిల్ లో ఇప్పటివరకు 17 వార్డుల ఫలితాలు వెలువడగా,అందులో వైసీపీ 15 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షానికి అందనంత దూరంలో నిలిచింది. టీడీపీ కేవలం 2 స్థానాలనే గెలిచింది. ఇప్పటికే వైసీపీకి మెజారిటీ స్థానాలు ఖరారైపోయినందున, చైర్మన్ పదవి వైసీపీకి కన్ఫర్మ్ అయినట్టే.

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాల్టీని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాల్లో వైసీపీ 18 గెలవగా.. టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొంది.

ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ సైతం వైసీపీ దక్కించుకుంది. ఈ మున్సి పాల్టీలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ ఇప్పటికే 12 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే టీడీపీ 4 చోట్ల , జనసేన బీజేపీ 3 , ఇతరుల 1 స్థానాన్ని గెలుచుకున్నారు.

బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాల్టీ సైతం వైసీపీ దక్కించుకుంది. ఈ మున్సి పాల్టీలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే వైసీపీ 17 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది.

దాచేపల్లి : గుంటూరు జిల్లాలో దాచేపల్లి లో 11 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొంది.మున్సిపాల్టీలపైన జెండా ఎగుర వేసారు. టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది.

గురజాల : గుంటూరు జిల్లా , గురజాలలో వైసీపీ 16... టీడీపీ 3..జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి.

దర్శి: ప్రకాశంజిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయ దుందుభి మోగించింది. తొలిసారి దర్శి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుంటే దర్శిలో అనుహ్యంగా టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దర్శి నగర పంచాయతీలో మొత్త 20 వార్డుల గానూ టీడీపీ 13 వార్డులు గెలుపొందగా, 7 స్థానాలు వైసీపీకి దక్కాయి.

బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. బేతంచర్లలో మొత్తం 20 వార్డులుండగా.. వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది.

ఇక, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ లో 54 డివిజన్‌ లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్‌లు కాకుండా, మిగిలిన 46 డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఖాతా తెరవలేదు. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 15,14,19,27,28,33,36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం కావడం లాంఛనమే అయింది.

జగ్గయ్య పేట : జగ్గయ్యపేట లో ఫలితం పై ఉత్కంఠత కొనసాగుతుంది. జగ్గయ్యపేట లో వైసీపీ 8 , టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది.

కొండపల్లి : కొండపల్లి మున్సిపాలిటీ మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు వైసీపీ 13 , టీడీపీ 12 అలాగే ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
Tags:    

Similar News