గుజ‌రాత్‌లో ఐదుగురిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. రీజ‌నేంటి?

Update: 2021-10-26 11:48 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు విభాగంలోని కౌంట‌ర్ ఇంటిలిజెన్స్ వింగ్‌.. గుజ‌రాత్‌లో సోదాలు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో పంచ‌మ‌హ‌ల్ జిల్లాలోని గోద్రా ప్రాంతంలో ఆరు చోట్ల నిర్వ‌హించిన సోదాల్లో ఒక మ‌హిళ స‌హా మొత్తం ఐదుగురిని అరెస్టు చేసింది. ఏపీ డీజీపీ క‌థ‌నం మేర‌కు.. జాతీయ అంశానికి సంబంధించి తాము చేప‌ట్టిన ద‌ర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జ‌రిపిన‌ట్టు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విచారిస్తామ‌న్నారు. అయితే.. వీరిని ఎందుకు అరెస్టు చేయాల్సి వ‌చ్చింది.. సోదాల వెనుక రీజ‌నేంటి? అనేది డీజీపీ వెల్ల‌డించ‌లేదు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు సోష‌ల్ మీడియాలో దూష‌ణ‌ల‌కు సంబంధించి, విశాఖ‌ప‌ట్నంలో ఇటీవ‌ల వెలుగు చూసిన హానీ ట్రాప్ కేసుకు సంబంధించి లేదా.. గుజ‌రాత్‌లోని ముంద్రా పోర్టులో ల‌భించిన డ్ర‌గ్స్ కు సంబంధించి ఈ అరెస్టులు చేసి ఉంటార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు కేసుల‌ను కూడా నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ప‌రిశోధ‌న చేస్తోంది.

2019 న‌వంబ‌రులో ఏపీకి చెందిన కౌంట‌ర్ ఇంటిలిజెన్స్ పోలీసులు.. `డాల్ఫిన్ నోస్‌` అనే ఒక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. కొంద‌రు నేవీ ఉద్యోగులు.. పాకిస్తాన్‌కు చెందిన ఒక గ్యాంగ్ సృష్టించిన హానీ ట్రాప్‌లో చిక్కుకున్న‌ట్టు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఒక వ్యాపార వేత్త స‌హా 11 మందిని అరెస్టు చేశారు. స‌ద‌రు వ్యాపారి యాకుబ్ ఇమ్ర‌న్ గితేలి అలియాస్ గిటేలీ ఇమ్రాన్‌. ఇత‌ని స్వ‌స్థ‌లం గుజ‌రాత్‌లోని పంచ‌మ‌హ‌ల్ జిల్లాలో ఉన్న గోద్రాగా గుర్తించారు.

యాకుబ్ ఇమ్రాన్‌కు పాకిస్థానీ ఐఎస్ ఐ ఏజెంట్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, వీరితో నేవీ ఉద్యోగులకు మ‌ధ్య మ‌ధ్యవ‌ర్తిగా యాకుబ్ ప‌నిచేసిన‌ట్టు గుర్తించారు. యాకుబ్ త‌ర‌చుగా వ‌స్త్ర‌ వ్యాపారం నిమిత్తం.. పాకిస్థాన్‌కు వెళ్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలో అత‌ను నేవీ ఉద్యోగుల‌కు న‌గ‌దును జ‌మ చేసిన‌ట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి కార‌ణం.. అత్యంత కీల‌క‌మైన స‌మాచారాన్ని వారు ఇత‌నితో పంచుకోవ‌డ‌మే.

త‌ర్వాత ఈ కేసును ఎన్ ఐఏ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే 11 మందిపైనా చార్జిషీట్ కూడా దాఖ‌లు చేసింది. వీరిలో కొంద‌రు సైల‌ర్లు, పౌరులు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు మ‌హిళ‌లు.. సైల‌ర్ల‌ను సోష‌ల్ మీడియా గ్రూపుల్లో వ‌ల‌లోకి లాగాల‌ర‌ని.. వీరి వెనుక‌.. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త ఉన్నార‌ని కూడా అధికారులు గుర్తించారు.


Tags:    

Similar News