కేరాఫ్ మాజీ ముఖ్యమంత్రి : వారసులు ఇరగదీస్తారట...?

Update: 2022-08-08 11:47 GMT
ప్రజా జీవితంలో అత్యంత ప్రభావితం చేసేవి రెండే రంగాలు. అవి సినిమా రాజకీయాలు. ఈ రెండు రంగాలకూ కేరాఫ్ అడ్రస్ అంటూ ఉంటే ఎంట్రీ ఈజీగా ఉంటుంది. అలాగే కంటిన్యూ కావడానికి కూడా వీలు కుదురుతుంది. ఏపీ రాజకీయాల్లో చూస్తే అలాంటి రాజకీయ వారసులు చాలా మందే ఉన్నారు. వారంతా తమ జాతకాలను మరోసారి సరిచూసుకుంటున్నారు. ఏపీని ఎందరో సీఎంలు పాలించారు. వారిలో ఉమ్మడి ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి నుంచి నిన్నటి సీఎం చంద్రబాబు దాకా చాలా మంది తమ ముద్ర వేసుకున్నారు.

ఇక నీలం సంజీవరెడ్డి  దామోదర్ సంజీవయ్య, టంగుటూరి ప్రకాశంపంతులు, భవనం వెంకట్రామరెడ్డి వంటి దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా చేసినా వారి వారి వారసుల సందడి మాత్రం లేదు. అయితే ఆ తరువాత వరస మాత్రం గట్టిగానే ఉంది. చంద్రబాబుకు ముందు ఉమ్మడి ఏపీని ఎక్కువ కాలం పాలించి రికార్డు క్రియేట్ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడిగా ఆయన మనవడు కాసు క్రిష్ణారెడ్డి ఇప్పటికే ఒకసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మరోసారి వైసీపీ తరఫున పోటీకి దిగుతున్నారు.

అదే విధంగా ఎన్టీయార్ వారసుడిగా బాలయ్య ఉన్నారు. ఆయన ఎన్టీయార్ పోటీ చేసి గెలిచిన హిందూపురం శాసనసభ నుంచి ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ముచ్చటగా మూడవసారి ఆయన పోటీకి దిగబోతున్నారు. అలాగే ఎంటీయార్ కుమార్తె పురంధేశ్వరి కూడా రాజకీయంగా తన సత్తా చాటారు. ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె 2014లో రాజంపేట నుంచి, 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఇక 2024లో ఆమె బీజేపీ తరఫున ఎంపీగానే బరిలోకి దిగుతారు అని అంటున్నారు.

మరో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున నంబర్ టూ గా ఉన్నారు. ఆయన తెనాలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇపుడు ఆయన తెనాలి నుంచే పోటీకి రెడీ  అవుతున్నారు. మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కొడుకు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కోడలు సుజాతమ్మ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. అలాగే వారి కుమారుడు కూడా ఈసారి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఏపీ సీఎం జగన్ ఎటూ వైఎస్సార్ వారసుడిగా ఉన్నారు. ఆయన తండ్రి బతికి ఉన్నపుడే కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత సొంతంగా వైసీపీని పెట్టుకున్నారు. పులివెందుల నుంచి రెండు సార్లు ఆయన పోటీ చేసి ఒకసారి విపక్ష నేతగా మరోమారు సీఎం గా ఉన్నారు. ఈసారి కూడా పులివెందుల నుంచే జగన్ బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఇక మరో మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి వారసుడిగా లోకేష్ ఉన్నారు.

ఆయన తొట్టతొలిగా మంగళగిరి నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఈసారి మాత్రం డ్యామ్ ష్యూర్ గా గెలవాలని చూస్తున్నారు. ఆయన కూడా తన వంతుగా గట్టిగానే కష్టపడుతున్నారు. ఇలా చూసుకుంటే చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు కుమారులు, మనవళ్లు, వారసులు అంతా రాజకీయాల్లో సక్సెస్ కొట్టాలని  తమ అమితాసక్తిని చూపిస్తున్నారు. అయితే వీరి జాతకం ఏంటి అన్నది జనాలు డిసైడ్ చేయాలి.

అయితే ఎంతమంది వారసులు వచ్చినా తమ తండ్రులు తాతల రాజకీయ పలుకుబడిని దాటి ముందుకు రాలేని పరిస్థితి ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర మాత్రం ఒక్క జగన్ కి మాత్రమే ఉంది. ఇక లోకేష్ కూడా ఈసారి తన సత్తా చాటితే టీడీపీ పవర్ లోకి వస్తే ఏదో నాటికి ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు దండీగా ఉన్నాయి.
Tags:    

Similar News