ముగిసిన ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. టీడీపీకి షాకిచ్చిన ఎమ్మెల్యే

Update: 2020-06-19 11:51 GMT
రాజ్యసభ ఎన్నికలు ఏపీ అసెంబ్లీలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అందరు ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. ఒక్క టీడీపీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం టీడీపీ విప్ జారీ చేసినా ఓటు వేయకుండా షాకిచ్చాడు. హోం క్వారంటైన్ లో ఉన్న కారణంగా తాను ఓటింగ్ కు దూరంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.

రాజ్యసభ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 92శాతం పోలింగ్ పూర్తి అయ్యింది. 168మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా వారు క్యూలో ఉన్నారు. వైసీపీ నుంచి 149మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. ఉండవల్లి శ్రీదేవి, కోన రఘుపతి ఓటు వేయలేదు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు. సీఎం జగన్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వైసీపీ ఒక్కో రాజ్యసభ స్థానానికి 34 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలని నిర్ధేశించింది. వైసీపీ ఏజెంట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉన్నారు.

ఇక వీరే కాదు వైసీపీకి మద్దతు తెలిపి టీడీపీకి దూరంగా ఉంటున్న టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరిలు కూడా అసెంబ్లీకి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇక కరణం బలరాం అనారోగ్యం కారణంగా ఓటేయలేదు. అచ్చెన్నాయుడు జైల్లో ఉండడంతో పాల్గొనలేదు.

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరుఫున మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి, పరిమిళ్ నత్వాని బరిలోకి దిగారు. టీడీపీ తరుఫున వర్ల రామయ్య పోటీచేస్తున్నారు.
Tags:    

Similar News