బ్రేకింగ్ : ఏపీలో తొలి కరోనా మరణం !

Update: 2020-04-03 10:10 GMT
ఆంధప్రదేశ్ లో  కరోనా కల్లోలం  సృష్టిస్తుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం నమోదైంది. ఏపీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విజయవాడ నగరంలోనే తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ళ వ్యక్తి కరోనా మరణంతో మరణించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అయితే.. మృతుడు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కాకముందే మరణించాడు. మార్చి 30వ తేదీన మరణించిన ఈ 55 ఏళ్ళ వ్యక్తికి మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ మరణంగా తేలింది.

విజయవాడలోని కుమ్మరపాలెంకు చెందిన షేక్ సుభానీ అనే వ్యక్తి మార్చి 30 వ తేదీన ఉదయం గం.11.30 ని.లకు విజయవాడ జనరల్ ఆసుపత్రికి చెకప్ నిమిత్తం వెళ్లగా , అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగానే మధ్యాహ్నం 12:30 సమయంలో మరణించాడు. మరణానంతరం పరీక్షలు కొనసాగించగా.. అతనికి కరోనా సోకినట్లు తేలింది. దాంతో అతని కుటుంబీకులు ఎక్కడెక్కడ తిరిగారు అని అరా తీయగా, షేక్ సుభానీ తనయుడు గత నెల 17వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీనితో  కొడుకు ద్వారానే తండ్రికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. తనయునికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా.. మృతునికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలుండడం వల్లనే తొందరగా మృత్యువాత పడినట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు. సుభాని 29 మందిని కలిశాడని, వారందర్నీ క్వారంటైన్‌కు తరలించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

షేక్ సుభానీ తనయునికి కూడా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. కొడుకు తనకు కరోనా సోకినట్లు భావించకపోవడమే వల్లే అతని తండ్రి ప్రాణాలకి ముప్పు వచ్చింది అని,    మార్చి రెండు, మూడు వారాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు, ముఖ్యంగా నిజాముద్దీన్ సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరు విధిగా, స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ముందుకు రావడం ద్వారా తమ కుటుంబీకులను, సన్నిహితులను కరోనా బారి నుంచి కాపాడాలని ఏపీ ప్రభుత్వం మరోసారి విఙ్ఞప్తి చేసింది. ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు 161 కేసులు నమోదయ్యాయి.   నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు - తర్వాత కృష్ణాలో 23 - గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News