తమ్మినేని బిగ్ సౌండ్... చాన్స్ ఉందంటారా...?

Update: 2022-09-11 15:36 GMT
ఉత్తరాంధ్రాలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ నుంచి వేటు ఖాయమని గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో అసలైన జిల్లా నుంచే రాజకీయ పొలికేక వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు సీదరి అప్పలరాజు, రెండవవారు ధర్మాన ప్రసాదరావు. సీదరి మీద హై కమాండ్ కి మంచి అభిప్రాయమే ఉంది అంటున్నారు. ఆయన మీద నివేదికలు కూడా పాజిటివ్ గా వెళ్లాయంట.

ఇక పెద్దమనిషిగా పేరున్న ధర్మాన ప్రసాదరావు అయితే పార్టీ సైడ్ గా  నోరు విప్పడంలేదు అని అంటున్నారు. ఆయన మంత్రి అయి అయిదు నెలలు గడచినా మీడియా ముందు పెద్దగా వెలిగిపోవడంలేదు అన్న చర్చ కూడా వస్తోంది. ఒక విధంగా ఆయన అన్న మంత్రిగా ఉన్నపుడు అయినా ధర్మాన ఏదో ఒక సంచలన కామెంట్స్ తో మీడియా అటెన్షన్ లో ఉండే వారు. కానీ మినిస్టర్ అయ్యాక మాత్రం ఆయన పెద్దగా సందడి చేయడంలేదు అంటున్నారు.

అయితే ధర్మానది మొదటి నుంచీ అదే తత్వం. ఆయన విపక్షాలను కేవలం రాజకీయాల కోసం విమర్శించరు. విధానపరమైన విమర్శలు మాత్రం చేస్తారు. పైగా ఆయన రెవిన్యూ శాఖను సమర్ధంగానే నిర్వహిస్తున్నారు అన్న పేరు ఉంది. సో ఆయన జిల్లా వైసీపీకి ఎన్నికల రధసారధిగా ఉంటారనే అంటున్నారు. అయితే నవంబర్ లో మంత్రి వర్గంలో మార్పుచేర్పులు అన్న వార్తలతో ఇదే జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్ళీ సౌండ్ చేస్తున్నారు.

ఆయన స్పీకర్ గా ఉన్న‌ప్పటికీ రాజకీయ విమర్శలు చేయడం షరా మామూలుగానే ఉంటూ వస్తోంది. నేను స్పీకర్ కంటే ముందు వైసీపీ ఎమ్మెల్యేను అని చెప్పుకుని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో ఆయన మళ్ళీ తన స్వరం పెంచారు. ఈసారి ఉత్తరాంధ్రాలకు విశాఖ రాజధాని అవసరం అని వైసీపీకి ఇష్టమైన మూడు రాజధానుల పాట వినిపించారు. పైగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ ఉత్తరాంధ్రాకు వచ్చి మీకు రాజధాని వద్దు అని చెబుతారా అని ఫైర్ అయ్యారు.

ఏపీలో మూడు రాజధానులు ఉంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని కూడా గర్జించారు. బాబు తన సొంత సామాజికవర్గం కోసమే అమరావతి రాజధాని అని అంటున్నారు అని కూడా విమర్శించారు.అభివృద్ధి  అంతా ఒకే చోట పోగైతే వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయని కూడా తమ్మినేని అంటున్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు హాయిగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి తమ్మినేని వైసీపీ హై కమాండ్ కి ఇష్టమైన వాయిస్ నే వినిపించారు.

మరి తమ్మినేని సడెన్ గా ఇలా మీడియా ముందుకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులలో ఎవరిని అయినా తొలగిస్తే తనకు కచ్చితంగా బెర్త్ ఉంటుంది అని ఆయన ఆశిస్తున్నారా అన్నదే ఆయన ఆలోచనగా ఉందా అని అంటున్నారు. అయితే మలి విడత విస్తరణలో  మొదట్లోనే తమ్మినేనికి మంత్రి పదవి ఇచ్చి ధర్మాన ప్రసాదరావుకు స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకున్నారు. కానీ చివరికి రాజకీయ  సమీకరణలు అన్నీ చూసుకున్నాక  ప్రసాదరావు అయితే వైసీపీకి కొత్త జోష్ వస్తుందని ఆయనకు పదవి ఇచ్చారని అంటున్నారు.

ఇక పార్టీ పరిధులు, హద్దులు, పరిమితులు అన్నీ పాటిస్తూ పెద్ద మనిషిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుని స్పీకర్ గా చేసి రాజకీయ విమర్శలతో స్పీడ్ పెంచుతున్న తమ్మినేనికి ఈసారి  మంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ అయితే ఉంది మరి. బలమైన కాళింగ సమాజికవర్గానికి రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో మంత్రి పదవి అయితే దక్కలేదు.  పైగా జగన్ కి ఆయన మీద సానుభూతి ఉన్నది అని చెబుతారు.  మరి ఉత్తరాంధ్రాలో ఒకరికి వేటు ఖాయమంటే అది శ్రీకాకుళం జిల్లా నుంచా లేక మిగిలిన జిల్లాల నుంచా అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News