నిమ్మగడ్డకు షాక్.. ఎన్నికల నిర్వహణకు వాళ్లు నో?

Update: 2020-11-05 13:10 GMT
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదంలో ఏపీలోని జగన్ సర్కార్ తో ఢీకొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు షాక్ తగిలింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఏపీ ఉద్యోగ సంఘం ‘ఏపీఎన్జీవో’ నో చెప్పింది. కరోనా వైరస్ విస్తృతి, కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా లేమని ఏపీ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఉద్యోగులే నో చెప్పడంతో ఇప్పుడు ఎన్నికలను ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఏపీలో లేవని.. అందరికంటే ఎక్కువగా భారం పడేది పోలింగ్ సిబ్బంది అయిన తమపైనే అన్ని ఏపీ ఉద్యోగ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఏ ఉద్యోగులు ముందుకు రారని స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.నిమ్మగడ్డ ఒకవేళ ఎన్నికల నిర్వహణకే ముందుకెళితే తాము కోర్టును ఆశ్రయిస్తామని నేతలు హెచ్చరించారు.

ఇప్పటికే లాక్ డౌన్ లో 11వేల మంది పోలీసులు, వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారినపడ్డారని.. పోలీసులు, ఉద్యోగుల్లో వందల మంది చనిపోయారని.. అందుకే ఎన్నికల కారణంగా మళ్లీ కరోనా బారినపడతామనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న వారైతే దీన్ని తీవ్రంగా వ్యతరేకిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, పోలీసుల సహకారం లేనిదే ఏపీలో ఎన్నికల నిర్వహణ అసాధ్యం అవుతుంది.

నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సై అంటుండగా.. జగన్ సర్కార్ మాత్రం నై అంటోంది. దీంతో హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరుగుతున్న వేళ ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఉద్యోగులు తాము నిర్వహించలేమంటూ చేతులు ఎత్తేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఎస్ఈసీ నిమ్మగడ్డ దీన్ని ఎలా టేకప్ చేస్తారు? నిర్వహించడం సాధ్యమా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక ఉద్యోగుల వెనుక జగన్ సర్కార్ ప్రోద్బలం కూడా ఉండి ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News