జమ్ముకశ్మీర్‌ లో కొత్త పార్టీ.. కొత్త పాలిటిక్స్

Update: 2020-03-08 06:43 GMT
జమ్ముకశ్మీర్‌‌ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు - ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో గత ఏడు నెలలుగా అక్కడి రాజకీయాలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి మాజీ ముఖ్యమంత్రులు - పార్టీల నేతలు అందరినీ కేంద్రం గృహనిర్బందంలో ఉంచడమో అరెస్టు చేయడమో చేసింది. ఆర్టికల్ 370 రద్దు కారణంగా అక్కడ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఈ చర్య తీసుకుంది. దీంతో అక్కడ రాజకీయ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఇలాంటి వేళ అక్కడ కొత్త పార్టీ ఒకటి పురుడు పోసుకుంటోంది. శ్రీనగర్ వేదికగా ఈరోజు మరికొద్ది సేపట్లో ఆ పార్టీ లాంచ్ కానుంది.

జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి సయ్యద్ అల్తాఫ్ బుఖారీ మరికొందరితో కలిసి ఈ పార్టీని ఏర్పాటుచేశారు. జేకే అపనీ పార్టీ(జమ్ముకశ్మీర్ అపనీ పార్టీ) అనే దీనికి అధ్యక్షుడిగా శనివారం ఆయన్ను ఎన్నుకొన్నారు. సుమారు 30 మంది మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు పాల్గొన్న పార్టీ సమావేశంలో ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆదివారం లాంఛనంగా పార్టీని ప్రకటిస్తారు.

కాగా ప్రస్తుతం అక్కడ రాజకీయ శూన్యత ఉండడం.. పాత పార్టీలపై నిర్బంధం ఉండడంతో ఆయా పార్టీల్లోని నేతలంతా పెద్దసంఖ్యలో ఈ కొత్త పార్టీలో చేరబోతున్నారు. అయితే.. ఈ కొత్త పార్టీ విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉంటుంది.. కేంద్రం నిర్ణయాలపై ఈ కొత్త పార్టీ వైఖరి ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. కేంద్రం చెబుతున్న జమ్ముకశ్మీర్ అభివృద్ధి నినాదమే ఈ పార్టీ కూడా వినిపిస్తుండడంతో అంతా కేంద్రం కనుసన్నల్లో సాగుతుందన్న వాదనా ఉంది.


Tags:    

Similar News