బాబు నోట *సిగ్గు* మాట‌!... మోదీకి ఘాటు లేఖ‌!

Update: 2019-03-01 10:25 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ‌లో బీజేపీ ఏపీ శాఖ ఏర్పాటు చేస్తున్న బ‌హిరంగ స‌భ‌లో మోదీ ప్ర‌సంగించ‌నున్నారు. ఇప్ప‌టికే ఓ సారి రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన మోదీ... గుంటూరు వేదిక‌గా జ‌రిగిన స‌భ‌లో ఘాటు ప్ర‌సంగం చేశారు. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్, టీడీపీ ప్ర‌భుత్వంలోని మంత్రులు సాగిస్తున్న అవినీతి పాల‌న‌పై నిప్పులు చెరిగారు. తాజాగా మ‌రోమారు రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న మోదీ... విశాఖ కేంద్రంగా ఏం మాట్లాడ‌తార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. మోదీ ప‌ర్య‌ట‌న దాదాపుగా ఖ‌రారైంద‌న్న భావ‌న రాగానే... చంద్రబాబు త‌న‌దైన శైలిలో ప్ర‌ధానిపై విరుచుకుప‌డ్డారు. ఈ మేర‌కు నేరుగా ప్ర‌ధానికే ఓ లేఖ రాసిన చంద్ర‌బాబు... అందులో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఒట్టి చేతుల‌తో ఏపీకి రావ‌డానికి సిగ్గు లేదా? అంటూ మోదీని ఆయ‌న త‌న లేఖ‌లో నిల‌దీశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌న్నీ అమ‌లు చేస్తామ‌ని చెప్పిన మోదీ... గ‌డ‌చిన ఐదేళ్ల‌లో అస‌లు ఆ దిశ‌గా సింగిల్ చ‌ర్య కూడా చేప‌ట్ట‌లేద‌ని చంద్ర‌బాబు నిందించారు. ప్ర‌త్యేక హోదా కోసం తాను 29 సార్లు ఢిల్లీ వెళితే... క‌నీసం మోదీ త‌న‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని, ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాతో పాటుగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌, జాతీయ విద్యా సంస్థ‌లు, రాజ‌ధానికి నిధులు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన నిధుల విడుద‌ల... ఇలా మొత్తం 17 అంశాల‌ను త‌న లేఖ‌లో ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.... వీటికి స‌మాధానం చెప్పి తీరాల్సిందేన‌ని మోదీని డిమాండ్ చేశారు. ఏపీకి ఢిల్లీ క‌న్నా మెరుగైన రాజ‌ధానిని ఏర్పాటు చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికిన మోదీ... ఇప్ప‌టిదాకా అమ‌రావ‌తి నిర్మాణానికి లేశ మాత్రం నిధులు కూడా ఇవ్వ‌లేద‌ని వాపోయారు.

పోల‌వ‌రానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి కూడా నిధుల విడుద‌ల‌లో మాత్రం శీత‌క‌న్నేశార‌ని ఆరోపించారు. ఆర్థిక లోటు భ‌ర్తీలో సైతం కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని ఆరోపించారు. మొత్తంగా రాష్ట్రానికి పెద్ద‌న్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించాల్సిన మోదీ... రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి త‌రుణంలో ఏపీకి ఏమీ ఇవ్వ‌కుండానే ఒట్టి చేతుల‌తో రాష్ట్రానికి ఎలా వ‌స్తార‌ని ఆయ‌న మోదీని ప్ర‌శ్నించారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి రాష్ట్రాన్ని గ‌ట్టెక్కిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఇప్పుడు ఒట్టి చేతుల‌తో రాష్ట్రానికి వ‌చ్చేందుకు సిగ్గు లేదా అంటూ చంద్ర‌బాబు త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ లేఖ‌కు అటు మోదీ గానీ, ఇటు బీజేపీ నేత‌లు గానీ ఏం స‌మాధానం ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News