విశాఖకు తరలింపుపై కీలక ఆదేశాలు వచ్చేస్తున్నాయా?

Update: 2021-04-03 05:30 GMT
అధికారంలో ఉన్న వారు అనుకోవాలే కానీ.. చేయలేని పని అంటూ ఏమీ ఉండదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గతంలో అధికారపక్షం అనుకున్నంతనే అన్ని అయిపోయేవి కాదు. దానికి అంతో ఇంతో విపక్ష సాయం కూడా ఉండేది. ఇప్పుడవన్నీపాత రూల్స్ గా మారిపోయాయి. ఇప్పుడంతా అధికారంలో ఉన్న వారు ఒకసారి డిసైడ్ అయితే చాలు.. జరగాల్సిన పనుల్ని కోరుకున్నట్లుగా చేసి పెట్టే అధికార యంత్రాంగం ఇప్పుడు అన్నిచోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి దాకానో ఎందుకు?

ఏపీ రాష్ట్ర విభజన విషయాన్నే తీసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో విభజన నిర్ణయాన్ని తీసుకున్నారో తెలుస్తుంది. అంతేనా? రాష్ట్రానికి ఇస్తానన్న హామీని అమలు చేయకుండా గాల్లో కలిపేయటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని అమరావతి స్థానంలో విశాఖను ఎంపిక చేసుకోవటం.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన సంకేతాల్ని ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నోటి నుంచి రావటం తెలిసిందే.

విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే విషయంలో ఏ నిమిషమైనా అధికారులు సిద్ధంగా ఉండాలని కోరారు. దీంతో.. ఒక్కాసారిగా వాతావరణం వేడెక్కింది. నిజంగానే ప్రభుత్వం విశాఖకురాజధానిని తరలించే విషయంలో ముందడుగు వేసిందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. విశాఖకు రాజధానిని తరలించేందుకు వీలుగా కొందరు కీలక అధికారుల్నివిశాఖకు పంపుతున్నట్లుగా చెబుతున్నారు.

మొన్నటి వరకు పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల కారణంగా రాజధాని తరలింపునకు మరో ఏడాది పడుతుందని భావించారు. అయితే.. ఇటీవల జరిగిన మున్సిపల్ పోరులో విజయవాడ.. గుంటూరు కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకోవటంతో.. రాజధాని తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి తగ్గట్లే తాజాగా మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

 కోర్టుల్ని ఒప్పిస్తామని.. ఏ క్షణంలో అయినా సరే విశాఖను పరిపాలనా రాజధానిగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే పలువురు మంత్రులు సైతం.. రాజధాని తరలింపుపై తమ ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు. మొత్తంగాచూస్తే.. రాజధాని తరలింపు కార్యక్రమం ఒక్కసారిగా జోరెక్కటమే కాదు.. ఏక్షణంలో అయినా ఆదేశాలు వెలువడే వీలుందన్నమాట వినిపిస్తోంది.
Tags:    

Similar News