కోవిడ్ రోగుల‌లో కొత్త ల‌క్ష‌ణాలు ఇవేనా?

Update: 2022-08-17 04:03 GMT
త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కోవిడ్ మ‌రోమారు నిదానంగా కోర‌లు చాస్తోంది. మ‌రోమారు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఆగ‌స్టు 16న 8,813 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసుల ఉధృతి ఎక్కువ‌గా ఉంది. సాధార‌ణ ప్ర‌జ‌లే కాకుండా సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. దేశ రాజ‌ధానిలో రోజూ 1000కి త‌గ్గ‌కుండా కేసులు వెలుగు చూస్తున్నాయి. కాగా ఆగ‌స్టు 16న ఒక్క‌రోజే దేశంలో 29 మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

కాగా కొత్త‌గా కోవిడ్ సోకిన రోగుల్లో కొత్త‌గా అతిసారం (డ‌యేరియా), ఛాతీ నొప్పి పెరుగుతున్నాయ‌ని వైద్యులు చెప్ప‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఈ ల‌క్ష‌ణాలు గుండె పోటుకు కూడా కార‌ణ‌మ‌వ్వొచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

సాధార‌ణంగా కోవిడ్ సోకిన‌వారికి త‌ల‌నొప్పి, జ్వరం, ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయ‌ని వైద్యులు అంటున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ సోకిన‌వారు ఈ ల‌క్ష‌ణాలతోపాటు త‌మ‌కు డ‌యేరియాతోపాటు ఛాతీనొప్పి కూడా ఉంటోంద‌ని చెబుతున్నార‌ని పేర్కొంటున్నారు.

కోవిడ్ హెల్త్ సెంట‌ర్లు, ఆస్ప‌త్రుల్లో చేరే కోవిడ్ రోగుల్లో అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు) సంఖ్య పెరుగుతోంది. అలాగే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, స్ట్రోక్, హైపర్‌టెన్షన్ వంటి వాటితో బాధపడుతున్నవారు కూడా కోవిడ్ బారిన‌ప‌డుతున్నార‌ని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న‌వారితో స‌న్నిహితంగా మెలిగిన‌వారు కూడా కోవిడ్ బారిన‌ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఈ దీర్ఘ‌కాల వ్యాధులున్న‌వారు కోవిడ్ బారిన‌ప‌డ్డాక వీరి ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తోంద‌ని చెబుతున్నారు.

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్, ఊపిరితిత్తుల వ్యాధుల స్పెష‌లిస్ట్‌ రాజేష్ చావ్లా చెబుతున్న‌దాని ప్ర‌కారం.. కోవిడ్ రోగులు త‌ల తిర‌గ‌డం, విప‌రీత‌మైన బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డ‌టం, వాస‌న‌, రుచిని తాత్కాలికంగా కోల్పోతున్నార‌ని చెబుతున్నారు.

అలాగే జ్వరం లేదా చలి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, కండరాలు లేదా శరీర నొప్పులు, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, గొంతు నొప్పి, ముక్కు కారటం, వికారం లేదా వాంతులు, విరేచనాలు వంటి సాధార‌ణ లక్షణాలు కూడా కోవిడ్ రోగుల్లో క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

కాగా ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BA 2.75 ఉనికిని గుర్తించారు.ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపిన 90 శాంపిళ్ల అధ్యయనంలో కొత్త సబ్‌ వేరియంట్‌ను క‌నుగొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్రకారం.. కొత్త సబ్-వేరియంట్ BA 2.75 ఇప్ప‌టికే టీకా యాంటీబాడీల‌ను పొందిన‌వారికి కూడా సోకుతోంద‌ని తెలిపారు. BA.2.75 అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తోంద‌ని, అయితే ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కాద‌న్నారు.

అయితే మ‌ర‌ణాలు పూర్తిగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కాద‌ని అంటున్నారు. రోగుల్లో ముందుగా ఉన్న దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండ వ్యాధి కారణంగా సంభవించాయ‌ని చెబుతున్నారు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్ మొదలైన వైద్య సమస్యలతో వచ్చే వ్యక్తుల్లో మరణాల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News