జైట్లీ చెప్పిన ప్యాకేజీతో లాభమెంత? నష్టమెంత?

Update: 2016-09-08 06:47 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశంపై దాదాపు 27 నెలల తర్జనభర్జనల తర్వాత ‘హోదా’ లేదని.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం తేల్చి చెప్పేసింది. ఓపక్క హోదా మీద నిరసనలు పెరుగుతున్న వేళ.. జనసేన అధినేత మూడు అంచెల్లో ఉద్యమం చేస్తానని డిక్లేర్ చేసిన తర్వాత కూడా హోదాకు నై అంటూ ప్రత్యేక ప్యాకేజీనే సాధ్యమన్న విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయటం సీమాంధ్రులకు షాకింగ్ గా మారింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై అందరి మాట ఒక్కటే అయిన నేపథ్యంలో కేంద్రం తన మనసు మార్చుకుంటుందా? అన్న సందేహం కలిగినా.. ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యతులో కష్టమన్న ఉద్దేశంతోనే ప్యాకేజీకి మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. హోదా ఇవ్వకపోతే పోయారు. కనీసం.. ఇచ్చే ప్యాకేజీ అయినా సంతృప్తికరంగా ఉంటుందా? అంటే అలాంటిదేమీ లేదన్న విషయం తాజా ప్రకటనతో తేలిపోయింది.

తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో లాభమా? నష్టమా?అన్నది ఒక చర్చ. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ ఎంతన్నది కూడా ఇప్పుడో ప్రశ్నగా మారింది. జైట్లీ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే.. తాజా ప్యాకేజీ రూ.1.50లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఈ ప్యాకేజీ పట్ల ఏపీ అధికారపక్ష నేతలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయకున్నా.. అసంతృప్తి కూడా ప్రదర్శించని పరిస్థితి. రావాల్సిన హోదా రాని వేళ.. వచ్చింది కాస్త అయినా ఇప్పటికైతే సరిపెట్టుకుందామన్నట్లుగా ఏపీ అధికారపక్ష నేతల మాటలు ఉన్నాయి.

ఇక.. జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలోని అంకెల్ని పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల లబ్థి ఏ విధంగా అన్నది విశ్లేషిస్తే.. విదేశీ రుణసాయంగా ఏడాదికి రూ.4వేల కోట్ల చొప్పున రూ.20వేల కోట్లు.. పోలవరం తాజా అంచనాల ప్రకారం రూ.32వేల కోట్లు.. పారిశ్రామిక కారిడార్  నిర్మాణానికి రూ.12వేల కోట్లు.. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్రీయ విద్యా సంస్థల కోసం రూ.25వేల కోట్లు.. రాజధాని ఇన్నర్.. అవుటర్ రింగు రోడ్ల కోసం రూ.25వేల కోట్లు కేంద్రం సాయంగా అందించనుంది. ఇవి కాక.. పోర్టులు. ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి ఇచ్చే సాయం కలిపితే రూ.1.5లక్షల కోట్లు కానుంది.

మొత్తంగా చూసినప్పుడు భారీ ప్యాకేజీగా అనిపించినా.. దేనికదే విడివిడిగా చూసినప్పుడు.. ఏపీకి కలిగే ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఘనంగా చెబుతున్న మోడీ సర్కారు.. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హోదా మాటను పరిగణలోకి తీసుకోవటం ద్వారా ఏపీకి తీరని అన్యాయం చేసినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. విభజన సందర్భంగా ఇచ్చిన అన్ని హామీల్లోకి హోదానే పెద్దది. మిగిలినవన్నీ కూడా హోదా ముందు చిన్నవే. ఈ నేపథ్యంలో అసలైన హోదాను వదిలేసి.. మిగిలిన వాటిని అమలు చేస్తామన్న మాటను చూస్తే.. కేంద్రం ఇచ్చేది మహా ప్రసాదం అన్నట్లు ఫీల్ అవ్వాలనే చందంగా ఉండటం గమనార్హం. మన్మోహన్ నోటి నుంచి వచ్చిన హోదాను యథాతదంగా అమలు చేసిన పక్షంలో.. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ఒక లెక్కలోకి రాదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News