ఎంఏ సిలబస్​ లో మావోయిస్ట్​ భావజాలం..అరుంధతీ రాయ్ పాఠ్యాంశాల తొలగింపు

Update: 2020-11-13 16:39 GMT
తమిళనాడు తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్‌ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. అక్కడ ఎంఏ (ఇంగ్లీష్​) సిలబస్​లో ఉన్న ‘వాకింగ్​ విత్​ కామ్రేడ్స్​’ అనే పుస్తకంలోని పాఠ్యాంశాలను తొలగించింది. అయితే ఏబీవీపీ నాయకుల ఒత్తిడితోనే వర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే యూనివర్సిటీ నిర్ణయాన్ని డీఎంకే, సీపీఎం పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బీజేపీ మాత్రం మద్దతు తెలిపింది.2017 సంవత్సరం మాస్టర్ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇంగ్లీషులో అరుంధతీరాయ్‌ ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ పుస్తకాన్ని సిలబస్‌గా పెట్టారు. అరుంధతిరాయ్​ మావోయిస్టులతో మాట్లాడి.. వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకొని ఈ పుస్తకాన్ని రచించారు.

అయితే ఈ పుస్తకంపై ఏబీవీపీ తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నది. ‘ఈ పుస్తకాన్ని ఇంతకాలం సిలబస్​గా ఉంచడం దురదృష్టకరం. ఈ పుస్తకాన్ని ఎంఏ ఇంగ్లిష్​లో చేర్చడం అంటే మావోయిస్టుల భావజాలాన్ని విద్యార్థులమీద రుద్దడమే. ఈ పుస్తకాన్ని సిలబస్​గా కొనసాగించడం రాజ్యాంగవిరుద్ధం’ అంటూ ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు వైస్‌ ఛాన్సలర్‌ కేకే పిచుమణిని కలిసి నిరసన తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ పుస్తకాన్ని సిలబస్​ నుంచి తీసేస్తున్నట్టు వీసీ ప్రకటించారు.

ఈ పుస్తకం స్థానంలో ఎం కృష్ణన్ రాసిన 'మై నేటివ్ ల్యాండ్: ఎస్సేస్ ఆన్ నేచర్' అనే పుస్తకాన్ని చేర్చారు. అయితే వీసీ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించగా.. డీఎంకే, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ గతంలో తన రచనలకు బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. 2010లో ఆమె మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సందర్శించారు. ఆ అనుభవాల ఆధారంగా ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ అనే పుస్తకం రాశారు. తమిళనాడులో ఈ అంశం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Tags:    

Similar News